వైఎస్ జగన్.. రాజీనామా చెయ్: పోటెత్తుతున్న ట్వీట్లు

‘బై బై బాబు..’ అంటూ, 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం గుర్తుందా.? అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం.? వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ వాహనాలకు కూడా ఇవే నినాదాలు జత చేశారు.. అలా, చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ‘నువ్వు ఏదైతే ఇచ్చావో, అదే నీకూ దక్కతుంది..’ అని పెద్దలు ఊరకనే అన్నరా.? ‘రిజైన్ జగన్’ అనే నినాదం ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది.

తిరుపతి రుయా ఆసుపత్రిలో నిన్న ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు గుస్సా అవుతున్నారు. ‘రిజైన్ జగన్’ అనే ‘హ్యాష్ ట్యాగ్’తో హోరెత్తించేస్తున్నారు. వీళ్ళలో టీడీపీ మద్దతుదారులే ఎక్కువమంది వున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, రాజకీయాలతో సంబంధం లేని నెటిజన్లు కూడా, ఇదే హ్యాష్ ట్యాగ్ ద్వారా, తమ నిరసనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సరే, హ్యాష్ ట్యాగులతో ప్రభుత్వాల్ని కూల్చేస్తారా.? వీటిని చూసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాజీనామా చేస్తారా.? ఛాన్సే లేదు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యమయ్యింది.. సో, ఆ ఆక్సిజన్ ట్యాంకర్ ఓనర్ తెలుగుదేశం పార్టీకి చెందినవాడేమో.. అన్న కోణంలో అధికార వైసీపీకి మద్దతు పలికే కొంతమంది నెటిజన్లు వెతుకులాట షురూ చేసేశారు. లేకపోతే, గ్రాఫిక్స్ చేసేసి.. ఆక్సిజన్ ట్యాంకర్ మీద టీడీపీ సింబల్ వేసేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసెయ్యడం మామూలే.

వీటితోపాటుగా, సదరు రుయా ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నవారిలో ఎవరన్నా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారున్నారేమో చూసి, వారిని బదనాం చేసి.. తమ పార్టీని రక్షించుకోవడానికి బులుగు బ్యాచ్ ప్రయత్నించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోయాయి. ఒకప్పుడు నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకులుండేవారు. నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడా నైతికతను మన రాజకీయ నాయకుల నుంచి ఆశించడమే పెద్ద బూతు.