కేసీయార్, జగన్.. ఇప్పుడేమో దోస్తీ, అప్పుడేమో కుస్తీ.!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్నారు. అదీ ఓ వివాహ వేడుకలో ఈ కలయిక చోటు చేసుకుంది. కులాసా కబుర్లు చెప్పుకున్నారు. ఇరువురూ చాలా అంశాల గురించి చర్చించుకున్నారట కూడా. మంచిదే కదా.! కానీ, ఈ ‘స్నేహపూర్వక వాతావరణం’ కొన్నాళ్ళ క్రితం ఎందుకు లేదు.? అదే అసలు ప్రశ్న.

కొన్నాళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం చోటు చేసుకుంది. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం వున్నప్పటినుంచీ నీటి వివాదాలు కొనసాగుతున్నాయి. అవి విభజన తర్వాత మరింత ఎక్కువయ్యాయి. ఇటీవలి కాలంలో ఇరు రాష్ట్రాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది నీటి వివాదాల కారణంగా.

చిత్రమేంటంటే, అప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క చోట కూర్చుని చర్చించుకోలేదు. మరిప్పుడు, వివాహ వేడుకలో ఎలా కులాసా కబుర్లు చెప్పుకున్నారట.? అంటే, ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులకీ తమ తమ రాష్ట్రాల పట్ల, తమ తమ రాష్ట్రాల్లోని ప్రజల పట్ల బాధ్యత లేదని అర్థం చేసుకోవాలేమో.!

‘బస్తీ మే సవాల్..’ అనుకున్నారు, ‘నువ్వెంత..’ అని ఒకరంటే, ‘నువ్వెంత’ అని ఇంకొకరన్నారు.. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకుల మధ్య.. మరీ ముఖ్యంగా మంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధమిది. ‘పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని నీటి దొంగ..’ అనేశారు తెలంగాణ మంత్రి.

‘సమస్యే లేదు.. నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి నినదిస్తే, ఏపీ ముఖ్యమంత్రి కూడా అందుకు ధీటుగా స్పందించారు. ఒకరి మీద ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఏమైపోయింది ఆ వాడి, వేడి వాతావరణం.?

వ్యక్తిగత విభేదాలున్నా ప్రజల కోసం కలిసి పని చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద వుంటుంది. కానీ, వ్యక్తిగతంగా.. ఇదిగో ఇలాంటి వేడుకల్లో కలిసే వుంటారు.. ప్రజల విషయంలో కలిసి వుండాల్సింది పోయి.. అక్కడ మాత్రం, రాజకీయ వివాదాలంటూ సరికొత్త నాటకాలకు తెరలేపుతుంటారు. నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుడ్ని.. అని ఓ సినిమాలో పాట ఊరకనే రాలేదు మరి.