వైఎస్‌ వివేకా హత్యకేసు.. కొలిక్కి వచ్చేదెప్పటికో.!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి డెత్‌ మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. 2019 ఎన్నికల సమయంలో అత్యంత కిరాతకంగా వివేకానందరెడ్డిని దుండగులు హతమార్చిన విషయం విదితమే. ఈ ‘దారుణ హత్య’ని అప్పట్లో టీడీపీ, వైసీపీ ఓ రేంజ్‌లో రాజకీయం చేశాయి. వైసీపీకి రాజకీయంగా లబ్ది చేకూర్చింది వివేకా మృతి ఘటన. టీడీపీని మాత్రం నిలువునా ముంచేసింది.

అప్పట్లో వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సీబీఐ విచారణకు ఒప్పుకోలేదు. న్యాయస్థానం జోక్యంతో వైఎస్‌ వివేకా హత్యకేసు సీబీఐ చేతికి వెళ్ళింది. సీబీఐ తన పని ప్రారంభించింది.. పలువురు కీలక అనుమానితుల్ని విచారించింది కూడా. అయితే, కరోనా నేపథ్యంలో కొందరు విచారణాధికారులు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.. కొందరు కరోనా బారిన పడ్డారు కూడా.

ఈ నేపథ్యంలో కొత్త బృందం, రంగంలోకి దిగింది సీబీఐ తరఫున ఈ కేసు విచారణ కోసం. వివేకా ఒక్కరే ఇంట్లో వున్న సమయం చూసి దుండగుడు / దుండగులు అత్యంత కిరాతకంగా ఆయన్ని హతమార్చారు. ‘హై ప్రొఫైల్‌’ పొలిటికల్‌ లీడర్‌ అలా ఎలా ఒంటరిగా వున్నారు.? అన్నదే అసలు ప్రశ్న. పైగా, ఎన్నికల ప్రచార సమయమది. వైసీపీ శ్రేణులు ఆయన్ని ఒంటరిగా ఎలా వదిలేశాయన్నదీ కీలకమైన ప్రశ్నే. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆయన మృతదేహం పడి వుంటే.. గాయాలకు కట్టు కట్టి, ‘గుండె పోటు’గా తొలుత చిత్రీకరించారు కొందరు. అలా ఎందుకు చెప్పారు.? అన్నదానిపైనా చాలా అనుమానాలున్నాయి.

అన్నిటికీ మించి వివేకా మృతి చుట్టూ నానా రకాల రాజకీయాలూ నడిచాయి. సో, ఇది రాజకీయాలతో ముడిపడి వున్న హత్యకేసుగానే పరిగణించాల్సి వుంటుందేమో. వివేకా ఆషామాషీ వ్యక్తి కాదు. మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు. అంతటి ప్రముఖ వ్యక్తి.. అత్యంత కిరాతకంగా హత్యకు గురైతే.. ఇప్పటిదాకా కేసులో దోషులెవరో తేలకపోవడమా.? సీబీఐ విచారణ అయినా ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి.