అమరావతికి హైప్‌ ఇచ్చారు కాని.. ఒక్క శాశ్వత ఇటుక పడలేదు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనవి. నిజానికి రాజధాని నిర్మాణానికి అంత హైప్‌ అవసరం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్చంగా అదేపనిలో ఉన్నారు. దానికన్నా ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయాన్ని గందరగోళంగా మార్చారన్న అభిప్రాయం కలుగుతుంది. కాంట్రాక్టర్‌ను మార్చాలని, అంచనాలు పెంచాలని చంద్రబాబు… కుదరదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెబుతుండడంతో ఆ ప్రాజెక్టుపై స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. ఇక రాజధాని విషయానికి వద్దాం.

అమరావతికి శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు ఒక్క శాశ్వతమైన ఇటుక పడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపనకు ఎంత హడావుడి చేశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీలోని పదమూడు జిల్లాల నుంచి మట్టి, నీరు తెప్పించామని, అక్కడితో ఆగకుండా దేశంలోని పలు పవిత్ర క్షేత్రాల నుంచి కూడా అలాగే మట్టి, నీరు తెప్పించి దానిని ఒక పెద్ద కార్యక్రమంగా నిర్వహించారు. చంద్రబాబు చేస్తున్నది గమనించారో, లేక తనకు కూడా ఆలోచన వచ్చిందో తెలియదు కాని, ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏపీ రాజధాని కోసం మట్టి, నీరు తెచ్చారు.

ఇదంతా పవిత్రత అనే సెంటిమెంటుతో ప్రజలను భ్రమలలో పెట్టడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయినా ఎవరూ కాదనలేదు. ఎందుకంటే ప్రజల సెంటిమెంటును కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది కనుక. అయితే ఆ సమయంలో ప్రధాని మోడీ ఏదో ఒక పెద్ద ప్రకటన చేస్తారని అనుకున్నవారికి ఆశాభంగం అయింది. ఆయన ఏమీ చెప్పకుండా సూక్తి వచనాలు చెప్పి వెళ్లిపోయారు. అలా అని కేంద్రం నుంచి డబ్బు ఏమీరాలేదని కాదు. సుమారు 2500కోట్ల రూపాయల మొత్తం ఇచ్చారు. ఆ డబ్బు ఏమైందో తెలియదు కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సంధర్భాలలో కేంద్రం నుంచి తగు సహకారం అందడంలేదని చెప్పారు.

కాని అదేమాట కేంద్రంతో కాని, ప్రధాని, లేదా ఇతర ముఖ్య నేతలతో కాని చెప్పరు. అలాగే బీజేపీ నేతలు తాము ఏపీకి ఎంతో చేశామని అంటారు. చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు చెప్పడంలేదని వారు విమర్శిస్తుంటారు. ఈ మాటను వారు చంద్రబాబుతో అనరు. అప్పుడప్పుడు సోము వీర్రాజు వంటి వారు విమర్శలు చేస్తుంటారు. ఇదంతా దాగుడుమూతల ఆటగా సాగుతుంటుంది. ఈ నేపధ్యంలో ఒక్కసారి రాజధాని పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి ఉంది. ముప్పైమూడు వేల ఎకరాలు సమీకరించామని జబ్బలు చరుచుకునే చంద్రబాబు కాని, ఇతర నేతలు కాని, అక్కడ రైతులలో వస్తున్న అసంతప్తి గురించి మాట్లాడడం లేదు.

పలువురు మేధావులు అన్ని వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు అని ప్రశ్నించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. డిజైన్‌ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టడం, విదేశీయాత్రలు చేయడం, రాజమౌళి వంటి ప్రముఖులతో సినిమా సెట్టింగ్‌ల గురించి చర్చించడం వంటివి చేస్తూ మొత్తం రాజధాని అంటే అదేదో సినిమా వ్యవహారంగా మార్చుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీనియర్‌ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి వారు వెయ్యికోట్ల వ్యయంతో ఖర్చు చేసిన తాత్కాలిక భవనాలనే శాశ్వత భవనాలుగా వాడుకుని డబ్బు ఆదా చేయాలని సలహా ఇస్తున్నారు. కాని ఇప్పుడు చంద్రబాబు ఎవరి మాట వినేదశలో లేరు.

ఆయన ఊహల ప్రపంచంలో విహరిస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రైతుల పాట్లు వర్ణనాతీతం. తమకు అన్నీ అభివద్ధి చేసి ప్లాట్లు ఇస్తామన్నారని, కాని ఇప్పుడు ఎలాంటి సదుపాయాలు లేని, పిచ్చి కంప పెరిగిన భూములను ప్లాట్లుగా తీసుకోమంటున్నారని వాపోతున్నారు. చంద్రబాబు మాత్రం వాస్తు పేరుతో ఇప్పటికి సచివాలయం, అసెంబ్లీ గేట్లను పలుమార్లు మార్చారట. దానిని గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు వాస్తు ఉండాలి… తమకు మాత్రం వీధిపోటు ప్లాట్లు ఇస్తారా అని కొందరు వాపోతున్నారట. ప్రభుత్వానికి భూములు ఇస్తే ఏదో జరిగిపోతుందని ఆశించిన రైతులకు ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

అప్పుడు భూములు ఇస్తే, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబుతూ తిరిగిన మంత్రులు ఎవరూ ఇప్పుడు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ దశలో తాము భూములు రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు స్విస్‌ ఛాలెంజ్‌ వివాదం, మరోవైపు పాలనాపరంగా అవసరమైన భవనాల నిర్మాణాల విషయంలో ఒక స్పష్టత లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. విభజన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కష్ణారావు చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. రాజధాని కావాలా? మహానగరం కావాలా? రెండూ కావాలా? అది సాధ్యమేనా? వీటిపై క్లారిటీ అవసరమని ఆయన అంటున్నారు.

మహా నగరాలుగా విశాఖపట్నం, తిరుపతిలను అభివద్ది చేసుకుని అమరావతిని పాలనా నగరంగా వాడుకుంటే మంచిదని ఆయన సూచిస్తున్నారు. నిజానికి ఆయన బాధ్యతలలో ఉన్నప్పుడు ఈ సలహాలను లిఖిత పూర్వకంగా ఇచ్చి ఉంటే బాగుండేది. మొత్తంమీద అమరావతి పేరు కనిపెట్టి చంద్రబాబు నాయుడు మొత్తం విజయవాడ, గుంటూరు నగరాలను తానే నిర్మించారని తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుని అదే రాజధాని అనుకోవాలని అంటారని కొందరు చమత్కరిస్తుంటారు.

వాటి సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వపరంగా వేల ఎకరాల రాజధాని నిర్మాణం బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అదేదో తాను చేస్తానని చంద్రబాబు చెబుతూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు వేల ఎకరాల రాజధానా లేక వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే రాజధానా అన్నది ఆలోచించుకోవాలి. పేరు పెట్టాం కాబట్టి మొత్తం రాజధాని నిర్మించినట్లు అవదు.

రాజధాని అంటే ప్రభుత్వ ప్రధానా కార్యాలయాల హెడ్‌ క్వార్టర్‌ మాత్రమే. దానిని టూరిజం సెంటర్‌ మాదిరి ఆకర్షణీయ కేంద్రంగా చేయాలని ఆలోచన చేయడంలో పెద్ద తప్పులేదు కాని, అది అంత అవసరమా? అన్న చర్చ జరుగుతుంది. ఏదో ఒకటి మూడున్నరేళ్లు అయిపోయింది. ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అమరావతిని సెంటిమెంటుగా మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాకుండా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మాణం చేస్తే మంచిది. లేకుంటే అమరావతి భ్రమరావతిగానే మిగిలిపోతుందని హెచ్చరించక తప్పదు.