అనిల్‌తో వర్మ భేటీ: సినిమానా? రాజకీయమా.?

బ్రదర్‌ అనిల్‌కుమార్‌.. క్రైస్తవ మత ప్రబోధకుడు, పైగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలకు భర్త. ఈయన, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో భేటీ అవడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. వర్మతో అనిల్‌ భేటీలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా పాల్గొన్నారట. ఈ విషయమై వర్మ మాట్లాడుతూ, అనిల్‌తో భేటీ అయిన మాట వాస్తవమే అయినా, ఆ భేటీ వెనుక రాజకీయ, సినీ పరమైన కోణమేమీ లేదని, అనుకోకుండా జరిగిన భేటీ మాత్రమేనని తేల్చేశారు. క్రీస్తు, క్రైస్తవ మతం వంటి అంశాలపై అనిల్‌తో భేటీ సందర్భంగా చర్చ జరిగిందని వర్మ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి నిర్మాణంలో వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా రూపొందిస్తోన్న విషయం విదితమే. మరోపక్క, అనిల్‌ నిర్మాతగా ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే సినిమాకి వర్మ ప్లాన్‌ చేస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే అనిల్‌తో వర్మ భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. వర్మ మాత్రం ఈ విషయమై పెదవి విప్పడంలేదు. మరోపక్క, వర్మ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనీ, ఈ కారణంగానే తన సినీ గ్లామర్‌ని ఉపయోగించుకుని వర్మ వైఎస్సార్సీపీ నేతలతో పరిచయం పెంచుకుంటున్నారనే ఊహాగానాలు విన్పిస్తుండడం గమనార్హం.

మొత్తమ్మీద, సంచలనాలకు మారు పేరైన వర్మ, ఇటీవలి కాలంలో హిట్స్‌ లేకపోయినా, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఒక్క సినిమా టైటిల్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో వర్మ అలజడి సృష్టించారు. ఇంతకీ, అనిల్‌తో వర్మ భేటీని ఎలా అర్థం చేసుకోవాలి.? ఏమో మరి, ఆ ఇద్దరికే తెలియాలి.