అమరావతిని ‘ఆపు’తున్నదెవరు చంద్రబాబూ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ నేతలు రెండు మూడేళ్ళుగా ఒకే మాట చెబుతున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతోందని. మాటలైతే కోటలు దాటేశాయి.. కోటలేంటి, ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తున్నాయి. చేతలు మాత్రం, గడప దాటడంలేదు. రెండు మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే రెండేళ్ళు పూర్తయిపోయింది.

ఇప్పటికీ, అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది తప్ప.. ఏమాత్రం ముందుకి కదల్లేదు. అప్పటినుంచీ ఇప్పటిదాకా అమరావతిలో జరిగిన ఒకే ఒక్క మార్పు.. అదే అమరావతి పరిపాలనా ప్రాంగణం. అక్కడ సెక్రెటేరియట్‌, అసెంబ్లీ.. ఇవి మాత్రమే నిర్మితమయ్యాయి. అయితే, అవన్నీ తాత్కాలికం అని పదే పదే చంద్రబాబు సర్కార్‌ గుర్తు చేస్తూ వస్తోంది.

అంతా బాగానే వుందిగానీ, అమరావతి నిర్మాణాన్ని ఎవరు ఆపుతున్నట్లు.? చంద్రబాబు మాటల్లో అయితే, ప్రతిపక్షం అడ్డుపడుతోంది. అవునా, డిజైన్లను చంద్రబాబు ఖరారు చేయకపోవడానికి కారణమేంటట.? ఇక్కడా వైఎస్‌ జగన్‌ అనుమతి కావాలేమో.. అంటారా.? అది కాదు, వ్యవహారం. చంద్రబాబుకే నచ్చట్లేదు ఆ డిజైన్లు. మొన్నీమధ్యనే విదేశాలకు వెళ్ళి, డిజైన్లను ఖరారు చేసి వచ్చారు చంద్రబాబు. మరి, అప్పుడన్నా రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమవ్వాలి కదా.?

రాజమౌళి దర్శకత్వంలో, లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థతో చంద్రబాబు సమావేశమయి, డిజైన్లను ఖరారు చేశారు. ఇదిగో, అదిగో.. అంటూ వ్యవహారాన్ని తాజాగా సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ లెక్కన, రాజధానికి ‘అడ్డం’ పడుతున్నది చంద్రబాబు కాక ఇంకెవరవుతారు.? పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది.. గట్టిగా ఇంకో ఏడాది.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు. 2014 ఎన్నికల్లో చూపించిన గ్రాఫిక్స్‌కి కొంచెం మెరుగులు దిద్ది, కొత్త గ్రాఫిక్స్‌ని చంద్రబాబు చూపించబోతున్నారంతే.

చంద్రబాబు ఔనన్నా కాదన్నా.. ఆయన టీమ్‌ గగ్గోలు పెట్టినాసరే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అడ్డం పడుతున్నదీ, నిలువుగా అడ్డుగోడ కట్టేస్తున్నదీ చంద్రబాబు మాత్రమే. ఓ ముఖ్యమంత్రి, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అడ్డుపడటం, దాన్ని మళ్ళీ ప్రతిపక్షం మీద నెట్టేయడం.. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఇలాంటి ‘అద్భుతం’ జరగదేమో.!