ఆయన ఔట్‌ అనుకుంటే … ఈయన గోల మొదలైంది..!

‘తానొకటి తలచిన దైవమొకటి తలచును’ అన్న సామెత మాదిరిగా ఒకటి జరుగుతుందని అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు అన్ని రంగాల్లో ఉన్నా రాజకీయాల్లో ఎక్కువ. ఇక్కడ ఊహించనివి ఎక్కువ జరుగుతుంటాయి. తెలంగాణ టీడీపీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందో అధినేత చంద్రబాబునాయుడు విదేశాల నుంచి వచ్చాక, ఆయన రేవంత్‌ మాట్లాడాకగాని తెలియదు.

తన ఎపిసోడ్‌ మొత్తం మీడియా సృష్టి అని, తాను పత్తిత్తునని రేవంత్‌ చెప్పుకున్నంత మాత్రాన నమ్మే అమాయకులు ఎవరూ లేరు. ఆయన ఉంటాడా, పోతాడా అనే విషయం పక్కన పెడితే ఇంత హంగామా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అసలు ఈ పని దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు చేస్తారేమోననే అనుమానం ఉండేది. ఆయనకు చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉంది. బాబు ఆయనకు గవర్నర్‌ పదవి ఇప్పించలేకపోవడమే ఇందుకు కారణం.

ఈ పదవి దక్కడం గ్యారంటీ అనుకున్నారు మోత్కుపల్లి. పదవి వచ్చి చేతుల్లో పడుతుందన్నట్లుగా ఆశ పెట్టారు చంద్రబాబు నాయుడు. అనేకసార్లు నిరాశ కలిగినప్పటికీ ఏదో ఆశతో బతుకుతున్న దళిత నేతకు వెంకయ్య నాయుడు సైతం ఆశలు కల్పించారు. ఆయన ఉప రాష్ట్రపతిగా ఎంపికైన తరువాత ప్రమాణ స్వీకారానికి ముందు హైదరాబాదు వచ్చినప్పుడు టీడీపీ నేతలు కలుసుకున్నారు.

ఆ సందర్భంగా గవర్నర్‌ పోస్టు గ్యారంటీ అన్నట్లుగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు మోత్కుపల్లిని ఉద్దేశించి ‘కాబోయే గవర్నర్‌’ అని టీడీపీ నాయకుల సమక్షంలోనే అన్నారు. చాలాకాలం క్రితం చంద్రబాబు నాయుడు తమ్ముళ్ల సమక్షంలోనే మోత్కుపల్లిని కాబోయే గవర్నర్‌ అని చెప్పారు. మోత్కుపల్లిని కాబోయే గవర్నర్‌ అని వెంకయ్య అన్న దాఖలాలు లేవు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అనని వెంకయ్య ఉప రాష్ట్రపతి అయ్యాక ఆ మాట అన్నారంటే దానికి విలువ ఉన్నట్లే కదా.

ఉప రాష్ట్రపతి అయ్యాక పలుచోట్ల ఆయనకు సన్మానాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నాయకులూ ఆయన్ని కలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు ఆనందంగా తనతో సమావేశమైన సందర్భంలోనే ‘త్వరలోనే మీరు మోత్కుపల్లికి సంబంధించి శుభవార్త వింటారు’ అని చెప్పారు. అంటే మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇచ్చే విషయంలో వెంకయ్యకు సమాచారం ఉందనుకున్నారు. వెంకయ్య ఈ మాట అనడం ఆలస్యం వెంటనే టీడీపీ నేతలు, మోత్కుపల్లి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అభినందనల వర్షం కురిపించారు.ఏం ప్రయోజనం?

మోత్కుపల్లి కళ్ల ముందే గవర్నర్ల నియామకాలు జరిగిపోయాయి. కొత్త గవర్నర్లను నియమించినప్పుడల్లా మోత్కుపల్లి పేరు వినిపించేది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న ఈ నాయకుడు టీడీపీలో ఉండకపోవచ్చని కొందరు నాయకులు అనుకున్నారు. ఒకప్పుడు మోత్కుపల్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చెలరేగిపోయిన ఫైర్‌బ్రాండ్‌. ఆయన మీద ఒంటికాలి మీద లేచేవారు.

అయినప్పటికీ ఆయన దళిత నేత కావడంతో టీఆర్‌ఎస్‌ గాలం వేసిందని అనుకునేవారు. కాని క్రమంగా మోత్కుపల్లి డల్‌ అయిపోయారు. పార్టీలో ఉంటాడో పోతాడో అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కాని చివరకు పార్టీకి, బాబుకు అత్యంత విధేయుడిగా పేరుబడిన రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌ మొదలైంది. మోత్కుపల్లి బాబుకు పూర్తిగా మద్దతుగా మాట్లాడుతున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను బయటకు పంపాలన్నంత కసిగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.