ఇదే తెగువ ఢిల్లీలో కూడా ప్రదర్శిస్తే బాగు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి రకరకాల ప్రలోభాల పుణ్యమాని ఫిరాయించిన నాయకుల మీద అనర్హత వేటు వేసే వరకు తాము శాసనసభలో అడుగుపెట్టం అనేది ఆ పార్టీ నాయకుల ప్రతిజ్ఞ. మరైతే ఈ ప్రతిజ్ఞ కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమా. వారి పార్టీ విషయంలో ఇదేమాదిరి అన్యాయం పార్లమెంటు సభ్యుల విషయంలో కూడా జరిగినప్పుడు అక్కడ కూడా ఇలాగే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే ఉద్దేశం వారికి లేదు.

అక్కడ కూడా అనర్హత కు సంబంధించి వీరు సమర్పించుకున్న పితూరీలు ఇంకా పెడింగులోనే ఉన్నాయి. మరి అక్కడ కూడా ప్రభుత్వం స్పందించిన తీరుకు నిరసనగా పార్లమెంటుకు కూడా తమ పార్టీ ఎంపీలు హాజరు కాబోరు అంటూ.. జగన్మోహన్ రెడ్డి నిరసనను ప్రకటించగలరా? ఆయన అంత సాహసానికి ఒడిగట్టగలరా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారు కేవలం 21మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ఎంపీలూ ఉన్నారు. పార్టీ గెలిచిన తర్వాత.. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవల కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పసుపు కండువా ఒక్కటే తక్కువ… దాదాపు అంత పనీ చేసింది.

మధ్యలో కొత్తపల్లి గీత లాంటి వాళ్లు కండువాలు మార్చకుండానే.. దాదాపుగా అదే స్థాయిలో నడిపిస్తున్న వ్యవహారాలు బోలెడు ఉంటున్నాయి. అయితే కేవలం సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా, అలా వేటు పడేలా జగన్ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు మాత్రమే బుట్టా రేణుక పసుపు కండువా వేసుకోకుండా.. చంద్రబాబు అభివృద్ధి పనులకు మాత్రం మద్దతు ప్రకటించినట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు.

ఆమె మీద ఫిర్యాదు చేయడానికి జగన్ కు అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్పీవై రెడ్డి మీద ఫిర్యాదు సంగతేమిటి? ఆయన పార్టీ మారినప్పుడే వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది. అప్పటినుంచి దానికి అతీగతీ లేదు. ఏపీలో స్పీకరు ఎలా పట్టించుకోలేదో.. పార్లమెంటు స్పీకరు కూడా అలాగే పట్టించుకోలేదు. రాష్ట్రంలో అంటే తనకు స్పష్టంగా పరువునష్టం కళ్లెదుట కనిపిస్తున్నది గనుక జగన్ ఆగ్రహిస్తున్నారు గానీ.. ఢిల్లీ గురించి ఆయన అనుకోవడం లేదు.

నిజంగా జగన్ తన డిమాండులో బలం ఉన్నదని.. తమ నిర్ణయం సహేతుకమైనదని అనుకుంటే గనుక.. ఇదే వ్యూహాన్ని పార్లమెంటులో కూడా అనుసరించాలి. ఫిరాయించిన తమ పార్టీ ఎంపీ పై అనర్హత నిర్ణయం తీసుకునే వరకు తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు రారు అని హెచ్చరించాలి. అప్పుడు ఆయన జాతీయ స్థాయిలో ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడుతున్న వారికి హెచ్చరికలాగా.. అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించగలుగుతారు అని పలువురు పేర్కొంటున్నారు.