మీనమేషాలు లెక్కించడమే బాబు టెక్నిక్!

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వపు పదవీకాలం ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఇది అంత సులువుగా ఎవ్వరూ చెప్పగలిగే ప్రశ్నకాదు. పద్ధతి ప్రకారం అయితే.. 2019 ఏప్రిల్ మేల వరకు ప్రభుత్వం ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ జమిలి ఎన్నికల విధానం గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో… 2018 సంవత్సరాంతంలోనే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు రావచ్చుననే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.

అంటే మహా అయితే మరో ఏడాది పాటూ ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. కనీసం ఈ చివరి సంవత్సరంలో కూడా పదవులు అనుభవించకపోతే ఎలా? అనే ఆగ్రహావేశాలు తెలుగుదేశం పార్టీ నేతల్లో కలుగుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఎవ్వరికీ ఏ పదవులూ ఇవ్వకుండా చంద్రబాబు జాప్యం చేస్తుండడాన్ని పలువురు నిరసిస్తున్నారు. మీనమేషాలు లెక్కించడం ఆయన పదవులు ప్రసాదించేలోగా, ప్రభుత్వ పదవీకాలమేముగిసిపోయేలా ఉన్నదని వాపోతున్నారు.

ఉదాహరణకు తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలికి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. చంద్రబాబునాయుడు సక్రమంగా పదవులు కట్టబెడితే.. అయిదేళ్ల వ్యవధిలో కనీసం మూడు కమిటీలు వేసి ఉండవచ్చు. కానీ.. అలా జరగడంలేదు. దాదాపుగా ఏడాదికిపైగా టీటీడీ బోర్డు లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడిక బోర్డు నియమించినా.. ఏడాదికి మించి వారు పదవుల్లో ఉండే భాగ్యం కూడాలేదు. చంద్రబాబునాయుడు ఈ విషయంలో పదవులు పొందే నాయకులు కూడా ఏమాత్రం సంతోషం అనుభవించకుండా ఉండేలా వక్రనీతిని పాటిస్తున్నారనే విమర్శలు పార్టీ వర్గాల్లోనే పుష్కలంగా వినిపిస్తూ ఉంటాయి. అయినా చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు రావడంలేదు.

ఇక ఏడాదికి మించి ప్రభుత్వం ఉండకపోవచ్చుననే ఒత్తిడి పెరుగుతున్న సమయంలో మంగళవారం నాడు ఆయన నామినేటెడ్ పదవుల పందేరానికి కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇవ్వగలిగిన ప్రతి నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఎంతోకాలం కిందటే షార్ట్ లిస్టులను సిద్ధంచేసి ఉంచారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు వాటిని పరిశీలించడం కూడా జరిగింది. కానీ మంగళవారం నాటి భేటీలో కూడా ఏ సంగతీ తేల్చకుండా.. పదవుల ప్రకటన వాయిదా వేసినట్లు సమాచారం. మరోవారం దాటాక గానీ.. పదవుల ప్రకటన రాకపోవచ్చునని అంటున్నారు.

పదవుల పందేరం అంటే అధినేతకు రకరకాల ఒత్తిడులు ఉండవచ్చు. అయితే వాటిని ఎదుర్కొనాలి గానీ.. అసలు పదవులే ఇవ్వకుండా నానుస్తూ ఉంటే ఎలా అని అంతా అంటున్నారు. విపరీతమైన జాప్యం చేయడం ద్వారా.. ఆశావహుల్లో నిరాసక్తి పెంచేసి.. అడిగింది కాకపోయినా… ఏదో ఒక పదవి వస్తే చాలులే.. అనే పరిస్థితి వచ్చాక గానీ.. చంద్రబాబు ఇవ్వరని అంటున్నారు. అలా మీనమేషాలు లెక్కిస్తూ అందరిలో ఆసక్తిని చంపేయడమే.. అధినేత టెక్నిక్ అని దెప్పిపొడుస్తున్నారు.