కరోనా ధాటికి ప్రపంచమంతా ఎలా వణికిపోతోందో.. వ్యవస్థలన్నీ ఎలా స్తంభించిపోయాయో చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ప్రస్తుతం లక్షలాది మంది తిండి లేక అల్లాడుతున్నారు. అందులో ప్రధానంగా వలస కూలీలు, రోడ్డు పక్కన యాచన చేసి జీవించే వాళ్లు ఉన్నారు. ఐతే కరోనా వల్ల ఇప్పుడో ఫిలిం సెలబ్రెటీ సైతం తిండికి కష్టపడాల్సిన స్థితికి చేరుకున్నాడు.
ఆ సెలబ్రెటీ ఎవరో కాదు.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రస్తుతం సెలబ్రెటీలందరూ పని మానేసి ఇంట్లో కూర్చుని హాయిగా ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేస్తుంటే.. పృథ్వీరాజ్ మాత్రం జోర్డాన్‌లో చిక్కుకుపోయాడు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం గత నెలలో యూనిట్ సభ్యులతో కలిసి పృథ్వీరాజ్ జోర్డాన్‌కు వెళ్లాడు.
ఇంతలో కరోనా వచ్చి పడింది. దేశాల మధ్య రవాణా ఆగిపోయింది. దీంతో పృథ్వీరాజ్ అండ్ టీం జోర్డాన్‌లోనే చిక్కుకుపోయింది. అక్కడ కరోనా తీవ్ర స్థాయిలోనే ఉండటంతో అంతర్గత రవాణా కూడా ఆపేశారు. హోటళ్లు బంద్ అయ్యాయి. దీంతో చిత్ర బృందమంతా ఇప్పుడు తిండికి కూడా కష్టపడాల్సిన స్థితికి చేరుకుందట.
జోర్డాన్ మొత్తం లాక్ డౌన్ అయిపోవడంతో పృథ్వీరాజ్ టీంకు సాయం చేసేవాళ్లు కూడా కరవయ్యారట. తిండి నీళ్లు లేక అల్లాడిపోతున్న చిత్ర బృందాన్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ప్రభుత్వంతో దీని గురించి మాట్లాడుతున్నారు. పృథ్వీ రాజ్ టీం జోర్డాన్‌కు బయల్దేరేటపుడే పరిస్థితులు బాగా లేవని కొందరు వారించినా వినకుండా విమానం ఎక్కేసినట్లు సమాచారం.