తాప్సీ నటవిశ్వరూపమేనట

ప్రతి సినిమాకీ ‘నేనో డిఫరెంట్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా చేస్తున్నా’ అని చెప్పడానికి తాప్సీకి చాలా ఇబ్బందిగా వుంటోందట. ఎందుకంటే, ఆమె చేస్తున్నవన్నీ డిఫరెంట్‌ జోనర్‌లో డిఫరెంట్‌ కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలేనట. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. తెలుగులో ఈ మధ్యనే ‘ఆనందో బ్రహ్మ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ. అది అప్పటిదాకా వచ్చిన హర్రర్‌ కామెడీల్లో కాస్త కొత్తదనంతో కూడిన సినిమానే. అంతకు ముందు ‘ఘాజీ’ సినిమాలో కన్పించింది. అదీ ఆమెకు కొత్త జోనర్‌ సినిమానే.

ప్రస్తుతం హిందీలో ‘సూర్మా’ అనే సినిమా చేస్తోంది ఒకప్టపి హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇందులో తాప్సీ పాత్ర చాలా కొత్తగా వుండబోతోందట. నటన పరంగా చూస్తే, ఇందులో తన నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారని తాప్సీ చెబుతోంది. బాలీవుడ్‌లో తాప్సీకి అన్నీ భలేగా కలిసొచ్చేస్తున్నాయనే చెప్పాలేమో.!

మొన్నీమధ్యనే ‘జుద్వా-2’ అంటూ కమర్షియల్‌ హిట్‌ కొట్టిన తాప్సీ, అంతకు ముందు చేసిన ‘పింక్‌’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘బేబీ’, ‘నామ్‌ షబానా’ సినిమాలకూ కథ, కథనాల పరంగా చూస్తే కొత్తదనంతో కూడుకున్నవే. ‘సూర్మా’ కాకుండా తాప్సీ చేస్తోన్న మరో సినిమా ‘ముల్క్‌’. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తమ్మీద, సౌత్‌లో నటిగా మంచి మార్కులేయించుకోలేకపోయిన తాప్సీ బాలీవుడ్‌లో మాత్రం నటిగా సత్తా చాటడమే కాదు, కమర్షియల్‌ హిట్స్‌ కూడా సొంతం చేసుకుంటోంది. చూద్దాం.. నటవిశ్వరూపం చూపిస్తానంటోన్న తాప్సీ ‘సూర్మా’తో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో.!