తె-భాజపాతో కాంగ్రెస్ మైండ్ గేమ్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట తమ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోలేని స్థితికి ఆల్రెడీ చేరుకుంది. కనీసం అంతో ఇంతో ఊపిరి, జవసత్వాలు మిగిలి ఉన్న రెండో రాష్ట్రంలోనైనా ఉనికి కాపాడుకోవడానికి తిరిగి పూర్వవైభవం సంతరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.

తమ పూర్తి శక్తియుక్తులు, వ్యూహ చాతుర్యాలు, అపారమైన అనుభవం నుంచి జనించిన అడ్డదారులు అన్నీ అనుసరించి మొత్తానికి కాంగ్రెస్ పార్టీనైతే నిలబెట్టడానికి వారు తపన పడుతున్న ధోరణి కనిపిస్తోంది. అందులో భాగంగానే.. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డిని తమతో కలుపుకోవడానికి ఇప్పటికే డీల్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్, అదే స్థాయిలో తెలంగాణ భాజపా మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ భాజపాతో కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోంది.

తెలంగాణలో విజయంపై భాజపాకు ఎలాంటి నమ్మకం లేదని, అక్కడ తెరాస- కాంగ్రెస్ మద్య మాత్రమే పోరు నడుస్తున్నదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా చెబుతున్నారు. అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పరోక్షంగా భాజపానే అవకాశం కల్పించింది అనే సంగతిని కూడా మనం గుర్తించాలి.

తెలంగాణకు చెందిన ఏకైక భాజపా ఎంపీ , సీనియర్ మరియు అనుభవజ్ఞుడు కూడా అయిన బండారు దత్తాత్రేయను కేంద్ర కేబినెట్ నుంచి మోడీ తప్పించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ అంశాన్నే కుంతియా ఎత్తిచూపుతూ… తెలంగాణపై భాజపాకు ఎలాంటి ఆశాలూ లేవు గనుకనే.. ఇక్కడ ఒక్క మంత్రి పదవి ఇవ్వడం గురించి కూడా పట్టించుకోలేదని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు బలాన్ని విస్తరించకోవడం మీద ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి సహా చాలా మందే రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే బాగా ప్రచారం జరుగుతోంది. పైగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – తెరాసతో కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నదనే సంగతిని కాంగ్రెస్ ప్రచారంలో పెడుతోంది. ఇన్నాళ్లూ తెరాసతో పోరాడి.. మళ్లీ మిలాఖత్ కావడానికి ఇష్టం లేని వాళ్లంతా.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే పరిస్థితిని కల్పిస్తోంది.

అదే వ్యూహాన్ని భాజపా మీద కూడా ప్రయోగిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు తెరాసతో- భాజపా మిలాఖత్ అవుతుందనే ప్రచారంతో.. కమలదళంలోని గులాబీ వ్యతిరేకుల్ని ఆకర్షించాలనేది వ్యూహం. తెదేపాలో రేవంత్ అండ్ కో మాదిరిగా ఆ పార్టీలో ఎందరు కాంగ్రెస్ వ్యూహానికి ముగ్ధులై ఆ పార్టీలో చేరుతారో వేచి చూడాలి.