నవ్విపోదురుగాక.. నల్లధన వ్యతిరేక దినమట

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్‌ తీరు. 2016 నవంబర్‌ 8వ తేదీని దేశం అంత తేలిగ్గా మర్చిపోదు. రాత్రికి రాత్రి పెద్ద పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ నిర్ణయంతో ఒక్కసారిగా దేశం షాక్‌కి గురయ్యింది. అంతలోనే, తేరుకుంది. దేశానికి మేలు జరుగుతుందని భావించింది. ప్రతి ఒక్కరూ నరేంద్రమోడీ నిర్ణయాన్ని స్వాగతించారు.. అదీ, కొంత అనుమానం వ్యక్తం చేస్తూనే.!

నల్లధనంపై నరేంద్రమోడీ సర్జికల్‌ స్ట్రైక్‌.. అంటూ పెద్ద పాత నోట్ల రద్దు గురించి అంతా ఆశించారు. ఈ దెబ్బతో దేశంలో నల్లధనం అంతమైపోతుందనుకున్నారు. పెట్రోధరలు దిగొస్తాయని బీజేపీ నేతలు చెప్పారు. అసలు దేశం కనీ వినీ ఎరుగని అభివృద్ధిని చూడబోతోందని బీజేపీ నేతలు చెబితే, అది నిజమేనని జనం నమ్మారు. తీవ్రవాదం, అవినీతి, నల్లధనం.. ఈ మూడూ అంతమైపోతాయని సాక్షాత్తూ నరేంద్రమోడీ సెలవిచ్చారు.

ఏడాది తిరిగొచ్చింది. ఏం, జరిగిందని వెనక్కి తిరిగి చూసుకుంటే, 250 మంది సామాన్యులు తమ డబ్బు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్‌ కోసం డబ్బులు కావాలి మొర్రో..’ అంటూ బ్యాంకు సిబ్బంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది సామాన్యులు. ఇంతకన్నా దయనీయమైన స్థితి ఇంకేమన్నా వుందా.? బ్యాంకు సిబ్బందితో సామాన్యుల గొడవలు.. ఈ క్రమంలో అటు ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే, క్యూలైన్లలో నిల్చోలేక సామాన్యులూ తనువు చాలించాల్సిన దుస్థితి. ఆనాటి ఆ వైపరీత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!

ఇంతా చేసి, ఏం సాధించారన్న ప్రశ్నకు కేంద్రం వద్దనే సమాధానం లేదు. డిజిటల్‌ కరెన్సీ అన్నారు, ఇంకోటన్నారు. అంతా హంబక్‌. మేకిన్‌ ఇండియా పక్కన పెట్టి, ‘ఇంపోర్ట్‌ ఫర్‌ ఇండియా’ అంటూ పీఓఎస్‌ మెషీన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, వాటిని మూలన పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డబ్బుల్లేవు, కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించాలంటే అదనపు బాదుడు.. వెరసి సామాన్యుడి జేబు గుల్లయిపోయింది.

అవినీతీ, తీవ్రవాదం, నల్లధనం.. ఏదీ అంతమవలేదు. ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగాయి.. రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులూ పంచాయి. కమలనాథులే డబ్బులు పంచిన సంఘటనలు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చూశాం. ఇంకెక్కడ నల్లధనం అంతమైంది.? ఇంకెక్కడ తీవ్రవాదం అంతమయ్యింది.? ఇంకెక్కడ అవినీతి మటుమాయమయ్యింది.?

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విపక్షాలు నవంబర్‌ 8వ తేదీని బ్లాక్‌ డేగా ప్రకటిస్తే, కంగారు పడ్డ బీజేపీ అదే నవంబర్‌ 8వ తేదీని ‘నల్లధన వ్యతిరేక దినం’గా ప్రకటించేసుకుంది. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేమన్నా వుంటుందా.? విడుదలైన కొత్త 200, 500 నోట్లలో ఎన్ని బ్యాంకులకు తిరిగి చేరుతున్నాయి.? ఎంత సొమ్ము నల్లధనంగా మారి గోదాంలలోకి చేరింది.? ఈ ప్రశ్నలకు నరేంద్రమోడీ సర్కార్‌ సమాధానమిచ్చి తీరాలి.