పూరి వదలడు.. మహేష్ చేయడు

‘జనగణమన’.. పూరి జగన్నాథ్ లైబ్రరీలో ఎప్పట్నుంచో నలుగుతున్న సబ్జెక్ట్. కొన్నేళ్లుగా సినీప్రేక్షకుడు వింటున్న పేరు. మహేష్-పూరి కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మేన్ సినిమాల తర్వాత వస్తుందని ఆశిస్తున్న సినిమా. కానీ ఈ మూవీకి మహేష్ ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు.

మహేష్ తో ఈ సినిమా చేయబోతున్నట్టు చాన్నాళ్ల కిందటే ప్రకటించాడు పూరి. మహేష్ కూడా ‘వెయిటింగ్ సర్’ అంటూ అప్పట్లో ట్వీట్ చేశాడు. కానీ ప్రాజెక్టు మాత్రం సెట్ కాలేదు. ‘జనగణమన’ నెరేషన్ మహేష్ కు నచ్చలేదు. కానీ పూరి మాత్రం మహేష్ ను వదలట్లేదు.

మెహబూబా మూవీ ప్రమోషన్ లో భాగంగా మరోసారి ఈ సినిమా విషయం ప్రస్తావనకొచ్చింది. ఆ సినిమాను ఎలాగైనా పట్టాలపైకి తీసుకొస్తానని ప్రకటించాడు పూరి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అనే యాంగిల్ ను కూడా జోడించానని, కథ చాలా బాగుందని అంటున్నాడు.

అయితే ఈసారి పూరి వెర్షన్ లో చిన్న తేడా కనిపించింది. మహేష్ తో మరోసారి చర్చలు జరుపుతానని, అతడు ఒప్పుకోకపోయినా సినిమా మాత్రం ఆగదని చెప్పేశాడు. అంటే, ఇన్నాళ్లూ మహేష్ కోసం వెయిట్ చేసిన ఈ దర్శకుడు, మరోసారి మహేష్ నో అంటే వేరే హీరోతో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాడన్నమాట.