ప్రత్యేక హోదా: రిస్క్‌ చేసేస్తోన్న వైఎస్‌ జగన్‌

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ‘డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫిక్సయిపోయారా.? ఈ ప్రశ్నకు వైఎస్సార్సీపీ సమాధానం ‘ఔను’ అయితే మాత్రం, ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ రాజకీయంగా రిస్క్‌ చేసేస్తున్నట్టే.! ఎందుకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై అంత పాజిటివ్‌ కార్నర్‌ కన్పించడంలేదు మరి.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్‌లో యువత ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తున్నా, ఆ యువత ఎన్నికల్లో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ అయ్యే అవకాశం లేదు. ప్రత్యేక హోదా గురించి రోడ్డెక్కి ఆందోళనలు చేసేవారిలో ఎంతమంది ఓటు హక్కుని వినియోగించుకుంటారన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ప్రత్యేక హోదా సామాన్యుడికి ఏమాత్రం అర్థం కాని జడపదార్థంగా మారిపోయింది. అంతలా ప్రత్యేక హోదాని నీరుగార్చేశాయి టీడీపీ, బీజేపీ పార్టీలు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిన మాట వాస్తవం. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేసిన మాటా వాస్తవం. కానీ, ఆ రెండు పార్టీలూ చాలా కన్విన్సింగ్‌గా ప్రత్యేక హోదా అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టిలో పాతరేసేశాయి. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేసినా, రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో యువ భేరీ సదస్సుల పేరుతో హడావిడి చేసినా.. అవన్నీ అప్పటి ‘హంగామా’కి పనికొచ్చాయి తప్ప, ఉద్యమం ఒక్క అడుగు కూడా ముందుకు పడేందుకు ఉపయోగపడలేదు.

ఈ పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వేలాడ్డం వల్ల రాజకీయంగా వైఎస్సార్సీపీకి జరిగే మేలు ఏమీ లేదన్నది నిర్వివాదాంశం. ప్రత్యేక హోదా అనే కాదు, ప్రత్యేక రైల్వే జోన్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి. అంతెందుకు, ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఎవరూ ఎక్కడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ఆల్‌మోస్ట్‌ ‘డెడ్‌’ అయిపోయిన, ఈ అంశాలకు ‘లైఫ్‌’ ఇచ్చి, రాజకీయంగా లబ్ది పొందుతామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తే, అంతకన్నా వృధా ప్రయత్నం ఇంకోటుండదు. పైగా, ఇదే అంశాన్ని పట్టుకుని వేలాడితే, ఇతర ముఖ్యమైన అంశాలు పక్కకు పోతాయి.

సో, ప్రత్యేక హోదా అంశాన్ని మిగతా అంశాలతోపాటు ఓ అంశంగా మాత్రమే వైఎస్‌ జగన్‌ చూస్తే ఫర్లేదుగానీ, అదే అంశాన్ని డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా జగన్‌ భావిస్తే మాత్రం, రాజకీయంగా జగన్‌ చాలా వెనకబడిపోయే అవకాశాలున్నాయి.