మైత్రీ వారి పంచ సినిమా ప్రణాళిక

రెండు హిట్ లు కొట్టి, రంగస్థలం 1985 లాంటి విభిన్న సినిమా నిర్మాణంలో బిజీగా వుంది మైత్రీ మూవీస్. మరోపక్క చాలా సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో మరో అయిదు సినిమాలు ఒకే సారి సెట్ ల మీదకు తీసుకెళ్లబోతోంది. ఇవన్నీ మాంచి క్రేజీ ప్రాజెక్టులు కావడం విశేషం.

పవన్ కళ్యాణ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరి తెలుగు రీమేక్ కు స్టార్ట్ చేయబోతోంది. పవన్-త్రివిక్రమ్ సినిమా వచ్చే నెల 15కు టాకీ పార్ట్ పూర్తయిపోతుందట. వచ్చే ఏడాది అక్టోబర్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటాయని రూమర్లు వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ సినిమాను త్వరగా స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలని చూస్తున్నారు.

ఇక మరో క్రేజీ ప్రాజెక్ట్ నాని-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో స్టార్ట్ అవుతుంది. ఇది జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుంది. ఈ కాంబినేషన్ కు మాంచి క్రేజ్ వస్తుందని మైత్రీ నిర్మాతలు భావిస్తున్నారు.

ఇక అర్జున్ రెడ్డితో జోష్ మీద వున్న విజయ్ దేవరకొండ ను స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చూపించే సినిమా ఒకటి త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. కాకినాడకు చెందిన రఘు అనే కొత్త డైరక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. మంచి స్క్రిప్ట్ దొరకడంతో ఈ సినిమాను వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ లో విజయ్ ఎగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడు.

చందు మొండేటి-నాగ్ చైతన్య సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా నాలుగు సినిమాలు ఫిక్స్ చేసుకున్ని అన్నింటిని జనవరి లోగా సెట్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో వుంది మైత్రీ మూవీస్.

అయితే అయిదో సినిమా కూడా వుంది. అయితే అది ఫిక్స్ కాలేదు. ఫ్లాపుల డైరక్టర్ గా ముద్ర పడిపోయిన శ్రీనువైట్ల ఎలాగైనా హిట్ కొట్టాలన్న పంతంతో మాంచి స్క్రిప్ట్ ఒకటి తయారు చేసారు. రవితేజ చేత ఓకె అనిపించుకున్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు మైత్రీ దగ్గరకు వచ్చింది. కానీ ఇంకా డిసైడ్ కాలేదు. అది కూడా ఒకె చేస్తే అయిదు సినిమాలు అవుతాయి.