ప్రాణం తీసిన ‘పద్మావతి’.!

‘పద్మావతి’ సినిమా ఓ యువకుడి ప్రాణాన్ని తీసేసింది. ఆ సినిమాకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు ‘వక్రమార్గం’లో పయనిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఓ యువకుడు, ‘పద్మావతి’ సినిమాకి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ యువకుడ్ని ఎవరైనా చంపేశారా.? నిజంగానే, సినిమాకి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్నాడా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సూసైడ్‌ నోట్‌ ప్రకారం చూస్తే మాత్రం, ‘పద్మావతి’ సినిమాని అడ్డుకునేందుకు ఎవర్నయినా చంపడానికి వెనుకాడం.. అలాగే అవసరమైతే మా ప్రాణాల్ని తీసుకోవడానికీ వెనుకాడం.. అంటూ ఆ యువకుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ సినిమాకి వ్యతిరేకంగా రాజ్‌పుత్‌ కర్ణిసేన గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న విషయం విదితమే. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, నటి దీపికా పడుకొనే తలలు తెగ నరకాలంటూ పెద్దయెత్తున డబ్బుని కూడా కొందరు ఆఫర్‌ చేస్తున్నారు.

సరిగ్గా ఈ టైమ్‌లోనే, సినిమాకి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జైపూర్‌లోని నహర్‌గర్‌ ఫోర్ట్‌ వద్ద ఓ యువకుడు ఉరితాడుకి వేలాడుతూ కన్పించడంతో.. రాజ్‌పుత్‌ కర్ణిసేన మరింతగా చెలరేగిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఆందోళనల కారణంగానే డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన ‘పద్మావతి’ కనీసం ఇప్పటిదాకా సెన్సార్‌ కూడా కాలేదు. దాంతో, నిర్మాణ సంస్థ సినిమా విడుదలను వాయిదా వేసింది.

మరోపక్క, బ్రిటన్‌లో సినిమా సెన్సార్‌ అయిపోయినా, అక్కడా సినిమా విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సుముఖంగా లేదు.