కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ తో హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, దినసరి కూలీలు, సినీ కార్మికులతో పాటు పలువురి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది.
రెక్కాడితే గానీ డొక్కాడని చాలామంది ప్రజలు లాక్ డౌన్ వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరోనాపై పోరులో కేంద్రంతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు తమవంతుగా విరాళాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ…కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా రూ.1.25 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, సినీ కార్మికుల కోసం చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి 25 లక్షలు విరాళమిచ్చి తన పెద్దమనసు చాటుకున్నారు బాలయ్య.
సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు సీ కల్యాణ్ కు రూ.25 లక్షల చెక్‌ను బాలయ్య శుక్రవారం నాడు అందించారు. ఈ డబ్బును సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బాలకృష్ణ ఇచ్చిన విరాళంపై చిరంజీవి స్పందించారు.
విరాళం ఇచ్చిన బాలయ్యపై చిరు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియమైన సోదరుడు బాలకృష్ణకు కృతజ్ఞతలంటూ చిరు ట్వీట్ చేశారు. సీసీసీకి రూ.25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారని, ఇటువంటి విపత్తులు వచ్చినపుడు తన వంతు సాయం చేయడంలో బాలకృష్ణ ముందుంటారని కొనియాడారు.
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే బాలయ్య అన్ని వేళలా తోడుంటారని చిరు ట్వీట్ చేశారు. కాగా, సీసీసీతోపాటు కేంద్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.