మంజునాథ వ్యధ – చంద్రబాబు ‘కాపు’ కథ.!

చంద్రబాబు రూటే సెపరేటు.. మంజునాథ కమిషన్‌ పేరుతో మూడున్నరేళ్ళు కాలయాపన చేసింది ఆంధ్రప్ర్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌. ‘కమిషన్‌ రిపోర్ట్‌ వచ్చాక, నిర్ణయం తీసుకుంటాం..’ అంటూ అధికార పార్టీ నేతలు, కాపు రిజర్వేషన్ల విషయమై ఎంతగా కహానీలు విన్పించారో చూస్తూనే వచ్చాం. చివరికి ఏమయ్యింది.? కమిషన్‌ నివేదిక రానేలేదాయె.! కానీ, అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్‌, కాపు రిజర్వేషన్ల బిల్లు పెట్టేసింది.

ప్చ్‌.. షరామామూలుగానే జస్టిస్‌ మంజునాథ, ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కమిటీ ఛైర్మన్‌గా నేనే నివేదిక ఇవ్వాల్సి వుంది.. మిగతా ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదికతో నాకు సంబంధం లేదు.. త్వరలో నా నివేదికను ప్రభుత్వానికి అందిస్తాను..’ అని సెలవిచ్చారాయన. కానీ, ప్రభుత్వ వాదన ఇంకోలా వుంది. మంత్రి నారాయణ అయితే, మంజునాథ కూడా కమిషన్‌లో ఓ సభ్యుడు మాత్రమేనని తేల్చేశారు. ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారాయన. ఇంకేముంది, మేటర్‌ క్లియర్‌.. జస్టిస్‌ మంజునాథ, చంద్రబాబు సర్కార్‌ దృష్టిలో ‘కూరలో కరివేపాకు’లా మారిపోయారన్నమాట. విషయాన్ని సాగదీయడానికి మాత్రమే ‘మంజునాథ’ అన్న పేరు చంద్రబాబు సర్కార్‌కి ఉపయోగపడింది.

కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షలు చేశారు, పాదయాత్ర కోసం నానా పాట్లూ పడ్డారు. నానా గందరగోళం చోటు చేసుకుంది.. ఏకంగా ఓ రైలు కూడా తగలబడింది. కానీ, ప్రభుత్వం తరఫున హైడ్రామానే నడిచింది. ఆ డ్రామాకి ఈ రోజు అనూహ్యంగా ముగింపు పడ్డట్టయ్యింది. బంతిని, చంద్రాబు సర్కార్‌ కేంద్రం కోర్టులోకి నెట్టేసి, చేతులు దులుపుకుంది.

కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని పక్కన పెడితే, కమిషన్‌ ఛైర్మన్‌ మాటకి విలువ లేనప్పుడు.. కమిషన్‌ ఎందుకు వేసినట్టు.? మూడున్నరేళ్ళపాటు ఈ కాలయాపన ఎందుకు చేసినట్లు.? అదే చంద్రబాబు రాజకీయ వ్యూహం.