వాణీ విశ్వనాథ్‌కూ వర్మ పంచ్ పడింది!

తెలుగుదేశం పార్టీలో తనూ ఉన్నాను అని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన వాణీ విశ్వనాథ్ కు దర్శకుడు ఆర్జీవీ తగిన గుర్తింపు ఇచ్చాడు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మినిస్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అనితలు మాత్రమే తెలుగుదేశంలో ఉన్నామని నిరూపించుకోగా.. ఇప్పుడు వాణీవిశ్వనాథ్ కూడా ఆ ప్రయత్నం చేసింది.

ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతి కోణం నుంచి సినిమా తీస్తే సహించేది లేదని చెప్పిన ఈమెకు వర్మ తగిన కౌంటర్ ఇచ్చాడు. వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తాను అని వాణి హెచ్చరించగా.. నాకు ఇల్లే లేదు.. ఎక్కడ ధర్నా చేస్తావ్.. అని వర్మ అంటున్నాడు. వర్మ పోస్టు సారాంశం ఇదీ.. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్ ఎన్టీఆర్ విరాభిమానిగా, ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి.

ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా నా Reply: వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా…. అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?’’ మొత్తానికి తెలుగుదేశం పార్టీకి, వర్మకు మధ్య సాగుతున్న రచ్చ జనాలకు వినోదంగా మారుతోంది.

తన సినిమా గురించి ఎంతమంది తెలుగుదేశం నేతలు మాట్లాడితే అంత మేలన్నట్టుగా వర్మ కూడా కాచుకుని కూర్చున్నాడు. వర్మపై ధ్వజమెత్తితే మైలేజ్ వచ్చేస్తోందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. దొందూ దొందే!