రేవంత్‌ రగడ: ‘టీ’ కప్పులో తుపానేనా.?

తెలంగాణ టీడీపీలో సాక్షాత్తూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చిచ్చుపెట్టడం – ఆ చిచ్చు కాస్తా కార్చిచ్చుగా మారి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అంతర్ధానం చేసేలా తయారవుతుండడం తెల్సిన విషయమే. అయితే, అంతా అంచనా వేస్తున్న స్థాయిలోనే రేవంత్‌రెడ్డి టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారా.? ఇదంతా అసలు నిజమేనా.? తెరవెనుక ఏం జరుగుతోంది.? ఈ ప్రశ్నలిప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

మామూలుగా అయితే టీడీపీ రాజ్యాంగం వేరు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. ఓ వ్యక్తి టీడీపీని వీడుతున్నారంటే, ఇక అంతే సంగతులు. ముందుగా టీడీపీ అనుకూల మీడియాలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కథనాలు షురూ అవుతాయి. ఆ తర్వాత, పొమ్మనకుండా పొగ పెట్టేస్తారు.. చివరికి పార్టీ నేతలు, ఎవర్నయితే బయటకు పంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీద దుమ్మెత్తి పోసేస్తారు. ఇదీ వరస. దాదాపుగా ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇలాంటి తంతే నడుస్తోందనుకోండి.. అది వేరే విషయం.

రేవంత్‌రెడ్డి విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తోంది. టీడీపీని వీడి, కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుని కూడా, తెలంగాణ టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రేవంత్‌రెడ్డిని అరవింద్‌కుమార్‌గౌడ్‌, మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించేశారు. ‘మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అధినేత చంద్రబాబుతోనే మాట్లాడుకుంటా..’ అని రేవంత్‌రెడ్డి తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు. ఇదీ జరిగిన విషయం.

‘అబ్బే, అసలు సమావేశంలో ఎలాంటి గలాటా జరగలేదు.. రేవంత్‌ విషయం చర్చకే రాలేదు. పార్టీ బలోపేతం గురించి మాట్లాడుకున్నాం..’ అని పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో చెప్పారుగానీ, అసలు విషయమేంటో అరవింద్‌కుమార్‌గౌడ్‌, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పేశారు.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాల్లో వున్నారు. ఆయన తిరిగొచ్చాక, రేవంత్‌రెడ్డితో సమావేశమవుతారా.? రేవంత్‌రెడ్డిని చంద్రబాబు బుజ్జగిస్తారా.? అసలేమవుతుంది.? అన్న ఉత్కంఠ అయితే టీడీపీ శ్రేణుల్లో వుంది. ఇంకోపక్క, రేవంత్‌ రాక కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది.

‘ఇది జస్ట్‌ టీ కప్పులో తుపాను మాత్రమే..’ అని తెలంగాణ టీడీపీ నేతల్లో ఒకరిద్దరు చెప్పొచ్చుగాక. కానీ, రేవంత్‌రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై.. మరీ ముఖ్యంగా మంత్రులపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా తీసుకోలేం. మింగలేక కక్కలేక నానా పాట్లూ పడుతున్నారు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయా మంత్రులు, ముఖ్య నేతలు. ఇక్కడే మేటర్‌ కాస్త గందరగోళంగా మారింది. చంద్రబాబు ఆశీస్సులు రేవంత్‌రెడ్డికి వున్నాయి గనుక (వుండాలి, తప్పదు.. ఎందుకంటే, ఓటుకు నోటు కేసు వుందిగా) , చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి భేటీ అయితే వివాదం నిజంగానే ‘టీ కప్పులో తుపాను’లా చల్లారిపోతుందని ‘కొంతమంది‘ టీడీపీ నేతలు చెబుతున్నదే నిజమవుతుందా.?