వాణి విశ్వనాథ్‌ ‘ఓవర్‌’ కాన్ఫిడెన్స్‌

తెలుగులో మాట్లాడటం ఇబ్బందికరమే అయినా, దాంతో రాజకీయాలకు సంబంధం లేదంటోంది సినీ నటి వాణి విశ్వనాథ్‌. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతోందామె. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకి ధీటుగా ‘గ్లామరస్‌’ ఇమేజ్‌ వుంది గనుక, వాణి విశ్వనాథ్‌ని వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంపైనే వాణి విశ్వనాథ్‌ కూడా కన్నేసింది.

ఇక, రాజకీయాల్లో వాణి విశ్వనాథ్‌తో పోల్చితే, రోజాకి సీనియార్టీ చాలా ఎక్కువ. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రోజా, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అందుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ప్రత్యర్థుల్ని పదునైన ‘మాటలతో’ ఇరకాటంలో పెట్టడం రోజా సొంతం. ఒక్కోసారి ఆ విమర్శలు హద్దులు దాటేస్తాయనుకోండి.. అది వేరే విషయం. అలాంటి రోజాతో, వాణి విశ్వనాథ్ రాజకీయంగా పోటీ పడటం సంగతి తర్వాత, ఆ పోలికే ఒకింత ఇబ్బందికరంగా అన్పించకమానదు.

ఎలా చూసినా, రోజాతో పోల్చితే వాణి విశ్వనాథ్‌కి రాజకీయాల్లో అంత ‘వీజీ’ ఏమీ కాదు. కానీ, వాణి విశ్వనాథ్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే మాత్రం, ‘ఈ రాజకీయం నాకో లెక్కా.?’ అన్నట్లుగానే ఆమె వుందనిపిస్తోంది. ‘ఒక్క రోజా కాదు, పది మంది రోజాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా నాకుంది..’ అని వాణి విశ్వనాథ్‌ చెప్పడమంటే, ఇది ఖచ్చితంగా ఓవర్‌ కాన్ఫిడెన్సే.

వాణి విశ్వనాథ్‌, స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడం, ఆ టైమ్‌లోనే ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’ అంటూ ఆమెను ఎన్టీఆర్‌ అడిగారనే గాసిప్స్‌ రావడం తెల్సిన విషయాలే. ఆ గాసిప్స్‌ని లైట్‌ తీసుకుంది వాణి విశ్వనాథ్‌. ‘ఆయన దేవుడు, గురువు..’ అంతకుమించి, ఇంకేమీ లేదని చెప్పిన వాణి, ఆ గాసిప్పే తప్పయినప్పుడు ఎన్టీఆర్‌ కుటుంబం తనకు వార్నింగ్‌ ఇచ్చిందనే గాసిప్స్‌లో నిజం ఎలా వుంటుందని ప్రశ్నించింది.