హోదా వాదులది మౌనముద్రా? మద్దతా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నది కేవలం జగన్మోహన రెడ్డి మరియు వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు. రాష్ట్రంలో ఇంకా ఇతర రాజకీయ పక్షాలు, తటస్థులు, మేధావులు, ఉద్యమకారులు అనేక మంది హోదా కావాలనే విషయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకహోదా వస్తే మాత్రమే.. ఏపీ వికాసం సాధ్యమవుతుందనే సంగతి చాలా మందికి తెలుసు. వారంతా దీనికి మద్దతుగానే నిత్యం మాట్లాడుతూ ఉంటారు.

అంతే తప్ప హోదా గురించిన పోరాటాన్ని ఒక రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం చేసే తరహాలో వ్యవహరిస్తున్న వారు లేరు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా కాడి పక్కన పడేశారనే చెప్పాలి. అయితే తాజాగా తన పాదయాత్ర ద్వారా హోదా కోసం ప్రజల ఆకాంక్షను కూడా ఢిల్లీ పాలకులకు వినిపించేలా చెప్పాలని అనుకుంటున్న జగన్మోహన రెడ్డికి.. రాజకీయాలతో నిమిత్తం లేకుండా… హోదాను కోరుకునే వారంతా మద్దతు ఇస్తారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కొన్ని రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కూడా కార్యక్రమంలో మాట్లాడారు. వారు చాలా స్పష్టంగా.. తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అంటూనే రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇది చాలా స్వాగతించదగిన పరిణామం.

నిజానికి రాష్ట్రంలో భాజపాను ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా పాట పాడుతూనే ఉంటోంది. కాకపోతే.. ఇప్పటికే అవసాన దశకు చేరిపోయిన పార్టీ కావడం మూలాన వారు చేసే ఉద్యమాలకు, ప్రయత్నాలకు కనీస గుర్తింపు కూడా లభించడం లేదు. అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి కూడా చలసాని శ్రీనివాస్ సారథ్యంలో ఉన్నది గానీ.. దాని పనితీరు కూడా బాగా మందగించింది.

ఇలాంటి నేపథ్యంలో తమంతగా ఉద్యమాన్ని ఉధృతంగా నడపలేని స్థితిలో ఉన్న వీరంతా కనీసం జగన్ కు రాజకీయాలకు అతీతమైన ప్రత్యేక హోదా మద్దతు ప్రకటిస్తే.. రాష్ట్రమంతా కలిసి కట్టుగా డిమాండ్ చేసినట్లుగా ఉంటుంది కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రప్రజల ఆకాంక్షను మరింత మెరుగ్గా ప్రతిబింబించినట్లు అవుతుంది.

నిజానికి పవన్ కల్యాణ్ కూడా జతకలిస్తే బాగుటుంది గానీ.. తెలుగుదేశంతో అంటకాగుతున్న ఆయన ఒక పట్టాన జగన్ పోరాటానికి సూత్ర ప్రాయ మద్దతైనా ఇస్తారనుకోవడం భ్రమ అని కొందరు వాదిస్తున్నారు. కానీ హోదా కోసం ఐక్య పోరాటం జరిగితే మాత్రం.. ఫలితం మెరుగ్గా ఉంటుందనే వాధన ఉంది