షాకింగ్‌.. తెలంగాణ‌లో క‌రోనాతో ఒకేసారి ఆరుగురు మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి తెలంగాణ‌లో ఒక్క‌సారిగా పంజా విసిరింది. ఈ వైర‌స్ ఒకేసారి ఆరుగురి ప్రాణాలు బ‌లిగొంది. ఈ విష‌య‌మై తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం సోమ‌వారం రాత్రి అత్య‌వ‌స‌ర ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 13-15 మ‌ధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్‌లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి క‌రోనా వైర‌స్‌ సోకిందని.. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించార‌ని ట్విట్ట‌ర్లో తెలంగాణ సీఎంవో వెల్ల‌డించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో, గ్లోబల్ ఆసుపత్రుల్లో ఒక్కొక్క‌రు.. నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వీరి ద్వారా కరోనా వైర‌స్‌ సోకే ప్ర‌మాదం ఉందని భావిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని.. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని.. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని.. వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని ప్ర‌భుత్వం కోరింది. తెలంగాణ‌లో క‌రోనా ప్ర‌భావం ప్ర‌మాద‌క‌రంగా ఏమీ లేద‌ని.. లాక్ డౌన్ చ‌ర్య‌ల‌తో వైర‌స్ ప్ర‌భావాన్ని సాధ్య‌మైనంత‌గా త‌గ్గిస్తున్నార‌ని భావిస్తున్న త‌రుణంలో ఒకే రోజు ఆరుగురు చ‌నిపోయార‌న్న వార్త విస్మ‌యం క‌లిగించేదే. ఇది జ‌నాల్లో భ‌యాందోళ‌న‌లు పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.