సుస్మిత సున్నితంగా కొట్టిపారేసింది

‘సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువట కదా.!’

– ఈ ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా.. దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ హీరోయిన్లను వెంటాడుతోంది.

ఎవరి గోల వారిది. ‘సినిమా పరిశ్రమలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వుంటే వుండొచ్చుగాక.. లేదని మాత్రం చెప్పలేం.. అలాగని, నేను మాత్రం అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని చెప్పను. ఎందుకంటే, నాకెప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు..’ అన్న మాటే ఎక్కువ మంది నుంచి విన్పిస్తోంది.

కొందరు మాత్రం, ‘ఇబ్బందికర పరిస్థితుల్లోంచి ముందడుగు వేశాం..’ అని చెబుతున్నారు. ‘అన్ని చోట్లా వున్నట్లే, ఇక్కడా మేల్‌ డామినేషన్‌ వుంది.. దాన్ని కాదనలేం. అయితే, అందరూ చెడ్డవాళ్ళే వుండరు..’ అనేవారి సంఖ్య తక్కువేమీ కాదు. చాలావరకు, సినీ పరిశ్రమ కూడా సమాజంలో భాగమేనని ఒప్పుకుంటున్నారు. సో, ‘వుంటే వుండొచ్చ’న్నమాట.

ఇదే ప్రశ్న బాలీవుడ్‌ బ్యూటీ సుస్మిత సేన్‌ ముందుంచితే, ఆమె సింపుల్‌గా కొట్టి పారేసింది. ‘నేనెప్పుడూ అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేదు. సెన్సిటివ్‌గా వుంటే, ఆటోమేటిక్‌గా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. స్ట్రాంగ్‌గా వుంటే, కమిటెడ్‌గా వ్యవహరిస్తే, స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌గా వుంటే మన జోలికి ఎవరూ రారు..’ అంటోంది సుస్మితాసేన్‌. ‘కొత్త హీరోయిన్లకు నేనిచ్చే సలహా ఇదే. ధైర్యంగా వుంటే, ఏ సమస్యలూ మీ జోలికి రావు’ అంటూ సుస్మితాసేన్‌ ఓ సలహా కూడా ఇచ్చేసిందండోయ్‌.