దుబాయ్ బంగారానికి నోట్ల దెబ్బ

భారత్ లో నోట్లు రద్దుచేస్తే.. ఆ ఎఫెక్ట్ దుబాయ్ బంగారం మీద పడింది. భారతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే బంగారం తయారుచేసే దుబాయ్ వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇక్కడ పెద్దనోట్లు రద్దవడంతో.. అక్కడ కొనుగోళ్లు పడిపోయాయి.

దుబాయ్ బంగారం కోసం అక్కడకు వెళ్లే భారతీయ పర్యాటకులందరూ ఎగబడి కొనుగోళ్లు చేస్తారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు చేతిలో డబ్బుల్లేక అల్లాడుతున్న జనాలు ఇండియాలోనే బంగారం కొనడం లేదు. ఇక ఎక్కడకో వెళ్లి ఏం కొంటారు. అందుకే దుబాయ్ బంగారం కళ తప్పింది.

బంగారం ఇక్కడికంటే దుబాయ్ లో బాగా తక్కువ. పైగా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. అందుకే కస్టమర్లు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. పైగా ఇప్పుడు బంగారం ధర తగ్గుతుంది కూడా. అయినా సరే మనవాళ్లు దుబాయ్ బంగారానికి ముఖం చాటేస్తున్నారు.

దుబాయ్ లో గోల్డ్ షాపింగ్ ఎక్కువగా జరిగే గోల్డ్ సోక్, బుర్జ్ దుబాయ్ లో కూడా సందడి తగ్గిపోయింది. రూపాయి మారకంలో 15 నుంచి 20 శాతం జరిగే అమ్మకాలు కూడా నోట్ల రద్దు దెబ్బకు పూర్తిగా పడిపోయాయి. అయితే భారత్ పర్యాటకులకు బదులుగా చైనా టూరిస్టులు కాస్త ఇంట్రస్ట్ చూపిస్తుండటంతో.. దుబాయ్ బంగారం పరిస్థితి గుడ్డిలో మెల్లగా మారింది.