సాయిపల్లవి కల నెరవేరిన వేళ

ప్రతి హీరోయిన్ కు ఫలానా హీరోతో నటించాలనే కోరిక ఉంటుంది. సాయిపల్లవికి కూడా అలాంటి కోరిక ఉంది. హీరోయిన్ గా మారకముందే సూర్యను కలవాలని, అతడితో కనీసం ఒక సెల్ఫీ దిగినా చాలని అనుకునేది. హీరోయిన్ అయిన తర్వాత సూర్య సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూసింది. ఇప్పుడా టైం రానే వచ్చింది.

తన నెక్ట్స్ సినిమాలో సాయిపల్లవికి ఛాన్స్ ఇచ్చాడు సూర్య. త్వరలోనే సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నాడు. ఈ మేరకు డ్రీమ్ వారియర్స్ నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. సాయిపల్లవిని తమ టీమ్ లోకి ఆహ్వానిస్తున్నామని ట్వీట్ చేసింది.

కోలీవుడ్ లో సూర్య, సెల్వరాఘవన్ ది క్రేజీ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో సినిమా కోసం అక్కడి జనాలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. కెరీర్ లో తన 36వ సినిమాతో అటు సెల్వ రాఘవన్ కు, ఇటు సాయిపల్లవికి ఒకేసారి ఛాన్స్ ఇచ్చాడు సూర్య.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కణం అనే సినిమా చేస్తోంది సాయిపల్లవి. తెలుగు, మలయాళ భాషల్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న ఈమెకు కోలీవుడ్ లో మాత్రం సరైన బ్రేక్ రాలేదు. సూర్య సినిమాతో తమిళనాట కూడా స్టార్ డమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.