బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 681 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 682 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 19) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
‘మీరు చాలా మంచివాళ్లు డాక్టర్ బాబు.. సరోజక్కని మీరు చాలా తక్కువ చూశారు. అలాంటిది తను ఎలాంటిదో అర్థం చేసుకున్న తన దరుపున తన భర్త(అనుమానించినట్లు కార్తీక్‌లో మార్పు కోసం నటిస్తే)కే వార్నింగ్ ఇచ్చారు. నేను మీతో కాపురం చేసినదాన్ని. నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు డాక్టర్ బాబూ?’ అంటుంది. దీప మాటలకు సమాధానం ఇవ్వకుండానే.. కార్తీక్ చాలా కూల్‌గా తుడుచుకుంటూ..‘చూడూ నేను వచ్చి తిన్నానంటే దానికి కారణం పిల్లలు. అంతే కానీ.. నువ్వు ఏం ఆశలు పెట్టుకోకు. మూడు రోజుల్లో విడాకులు నోటీస్ వస్తుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా విడాకులు వచ్చేస్తాయి’ అంటాడు. అది విన్న దీప బాధగా చూస్తూ ఉంటుంది. చాటుగా వింటున్న సౌర్య.. కార్తీక్ మాటలకు షాక్ అవుతుంది. ‘ఈ విషయం మా వాళ్లకు చెప్పి.. వాళ్లకీ నాకు గొడవలు పెట్టకు’అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు.
సౌర్య కన్నీళ్లు!
సౌర్య ఇంటి వెనుక ఓ బల్ల మీద కూర్చుని.. ‘కార్తీక్ కార్డియాలజిస్ట్’ అనే నేమ్ బోర్డ్‌ని చూసుకుంటూ.. ఏడుస్తుంది. (దాన్ని గతంలో సరోజ మరిది లక్ష్మణ్ గుండె నొప్పి వచ్చిన సమయంలో కార్తీక్ హాస్పెటల్‌కి వెళ్లినప్పుడు ఎవరూ చూడకుండా దాన్ని దొంగలించి తెచ్చి జాగ్రత్తగా దాచిపెడుతుంది సౌర్య.) ‘డాక్టర్ కార్తీక్.. కార్డియాలజిస్ట్.. ఇంత పెద్ద డాక్టర్ మా నాన్న. వంటలక్క కూతురు సౌర్య వాళ్ల నాన్న..పెద్ద డాక్టర్.. కానీ నేనెందుకు డాక్టర్ బాబు కూతురిగా పెరగలేదు. డాక్టర్ బాబు భార్య వంటలక్కలాగా ఎందుకు పని చేసుకుని బతకాలి? నేను ఎవరో తెలియనప్పుడే అమ్మకు ఫ్రీగా వైధ్యం చేస్తానన్నారు. నన్ను చదివిస్తున్నారు. నా పుట్టినరోజు చేశారు.. మరి ఇంత మంచి నాన్నకు ఇంత మంచి అమ్మ ఎందుకు వద్దు?’ అంటూ జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ.. తనలో తనే ప్రశ్నించుకుంటుంది.
వారణాసి ఎంట్రీతో..
కార్తీక్ దీపతో చెప్పిన మాటలు(మూడు రోజుల్లో విడాకులు వస్తాయి) తలుచుకుంటూ.. ‘ఇప్పుడేమో నాన్న అమ్మకు విడాకులు ఇస్తానంటున్నారు. అంటే.. ఇంకో పెళ్లి చేసుకోవంటే ముందు భార్యకు విడాకులు ఇవ్వాలనే నాన్న ఇలా అంటున్నారా? కాదు ఇంకేదో ఉంది అదేంటో నాకు తెలియడం లేదు. డాక్టర్ బాబూ.. మీరు మా అమ్మకు విడాకులు ఇస్తే మనం ఎప్పటికీ కలవలేమా? మంచి వాళ్లంటే అందరితోనూ మంచిగా ఉండాలిగా? మరి అమ్మని ఎందుకు ద్వేషిస్తున్నారు?’ అంటూ బాధపడుతుండగా వారణాసి.. ‘సౌర్యమ్మా..’ అంటూ వస్తాడు. వెంటనే చేతిలోని నేమ్ బోర్డ్ వెనక్కి పారేస్తుంది సౌర్య.
మాకు ఎవరు ఉన్నార్రా?
‘ఇక్కడేం చేస్తున్నావ్ సౌర్యమ్మా?’ అంటాడు వారణాసి రాగానే. ‘దాగుడు మూతలు ఆడుకుంటున్నానురా’ అంటుంది సౌర్య రాని నవ్వుని నటిస్తూ.. ‘అదేంటి సౌర్యమ్మా? నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావా?’ అంటాడు వారణాసి ఆశ్చర్యంగా.. ‘మరి మాకు ఎవరు ఉన్నార్రా?’ అంటుంది సౌర్య అమాయకంగా చూస్తూ.. ‘ఎందుకు లేరు.. నాన్నమ్మా.. తాతయ్యా.. పిన్నీ బాబాయ్..’ అంటూ ఆగిపోయి.. ‘అదే సౌర్యమ్మా.. వీళ్లంతా పరాయివాళ్లు అయినా మీ వాళ్లలానే చూసుకుంటారుగా సౌర్యమ్మా మిమ్మల్ని. అందుకే అలా అంటున్నాను’ అంటూ కవర్ చేస్తాడు.
అందరికీ నాన్న ఉంటాడు!
వారణాసి కవర్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న సౌర్య మనసులో.. ‘అంటే నిజం వీడికి కూడా తెలుసు మాటా’ అనుకుంటూ ‘రేయ్ వారణాసీ నీకు మీ నాన్న ఉండేవాడుగా.. చిన్నప్పుడు అతనితో కలిసే ఉన్నావ్ కదా?’ అని అడుగుతుంది. దానికి వారణాసి ‘అవును’ అంటాడు. ‘అందరింట్లో నాన్న ఉంటాడు. మా ఇంట్లోనే ఎందుకు ఉండడు’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. వెంటనే కూల్ అయ్యి.. ‘సరేలే నువ్వు వెళ్లు లేట్ అయ్యిందిగా’ అంటూ వారణాసిని పంపించేస్తుంది సౌర్య. వెంటనే కార్తీక్ నేమ్ బోర్డ్ తీసుకుని.. ప్రేమగా కార్తీక్ పేరును తాకుతూ.. తన బాధను మనసులోనే దాచుకుని లోపలికి వెళ్తుంది.
అతడిపై దీప ఆవేశం..
దీప ఒంటరిగా కూర్చుని.. చాలా బాధపడుతుంది. కార్తీక్ మాటలు తలుచుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో సరోజ, ఆమె భర్త, ఆమె చెల్లెలు, చెల్లెలు భర్త లక్ష్మాణ్ నలుగురూ కలిసి వస్తారు. సరోజ భర్తని చూడగానే.. దీప ఆవేశంగా.. ‘ఈ పెద్ద మనిషి కూడా వచ్చాడా? అసలు నువ్వు మనిషివేనా? సరోజక్కని అనుమానించి అవమానిస్తావా? అసలు చదువుకున్నోడు అంతే.. చదువులేనోడూ అంతేనా? భర్యని అర్థం చేసుకున్నది ఇంతేనా?’ అంటూ రగిలిపోతుంది. దాంతో సరోజ మాట్లాడుతూ.. దీపకు నిజం చెబుతుంది. ‘ఇందంతా కావాలనే మేము ఆడిన నాటకం దీపా.. కార్తీక్ నా గురించి ఆలోచించినట్లే నీ గురించి ఆలోచిస్తాడనే ఆశతో అలా చేశాం’ అంటుంది.
సరోజకు థ్యాంక్స్ చెప్పిన దీప!
సరోజ మాటలకు దీప కన్నీళ్లు తెచ్చుకుని.. సరోజ చేతులు పట్టుకుని.. ప్రేమగా.. ‘ఎంత పని చేశావ్ అక్కా.. నా జీవితం నిలబెట్టాలని నీ మీద నింద వేసుకున్నావా? అంతా మాట అనిపించుకున్నావా?’ అంటూ ఎమోషనల్ అవుతుంది. దాంతో సరోజ భర్త.. ‘తప్పులేదమ్మా.. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. నీ లాంటి దేవతను దూరం చేసుకున్న ఆ మనిషికి కూడా నిజం తెలియాలి కదమ్మా.. అందుకే ఇలా చేశాం’ అంటూ సమాధానం ఇస్తాడు. దాంతో దీప సరోజకు థ్యాంక్స్ చెబుతుంది. ‘ఈ రుణం తీర్చుకోలేని అక్కా.. సొంత అక్క కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయదు’ అంటూ తన ఆవేదన తెలుపుతుంది. దాంతో సరోజ ‘సరేలే.. నువ్వు ఇక ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో దీపా’ అని చెబుతుంది. అంతా కలిసి వెళ్లిపోతారు.
నా బతుకు ఇంతే!
సరోజ వాళ్లు వెళ్లగానే.. దీప ధీనంగా కుర్చీలో కూలబడి.. ‘ప్రశాంతంగా పడుకోవాలా? నా బతుక్కి అదెక్కడ జరుగుతుంది?’ అనుకుంటూ చాలా బాధపడుతుంది. ఏడుస్తుంది. ‘ఈ రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోలేను. నా వాళ్లంతా నా ఇంటికి వచ్చారని ఎంత ఆనందంగా ఉన్నానో అంతే బాధను మిగిల్చి వెళ్లిపోయాడు ఆ మనిషి(కార్తీక్)… నేను ఏం చేయలేని నిస్సహాయురాలిని. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నా జీవితం ఇక ఇంతే..’ అనుకుంటూ తనలో తనే కుమిలిపోతుంది. ఆ సీన్ చూస్తే ప్రేక్షకుల గుండె తడికాక మానదు.
ఇదంతా ఆ ఆదర్శమూర్తుల వల్లే!
హిమ నిద్రపోయి ఉంటుంది. దాంతో కార్తీక్ హిమని ప్రేమగా ముద్దాడి.. జరిగిదంతా తలుచుకుంటాడు. దీప మాటలు, దీపకు తను ఇచ్చిన వార్నింగ్ కూడా తలుచుకుంటూ.. రగిలిపోతాడు. ఇంతలో హిమ.. కలవాట్లు పలుకుతుంది. ‘సౌర్య నీకు అమ్మ ఉంది కానీ.. నాన్న లేడు. నాకు నాన్న ఉన్నాడు కానీ.. అమ్మలేదు.. వంటలక్కా.. వంటలక్కా’ అంటూ కలవాట్లు పలికి.. ఆగిపోతుంది. అదంతా విన్న కార్తీక్ ఆవేశంగా.. ‘అసలు ఇదంతా ఆ ఆదర్శమూర్తులు(సౌందర్య, ఆనందరావులు) వల్లే జరిగింది.. వాళ్లని’ అనుకుంటూ ముందుకు కదలుతాడు. వెంటనే హిమని చూసుకుని.. దుప్పటి కప్పి.. అక్కడ నుంచి ఆవేశంగా తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరతాడు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం!
కార్తీక్ కిందకు వెళ్లేసరికి.. సౌందర్య, ఆనందరావులు చాలా హ్యాపీగా ఉంటారు. అది చూసిన కార్తీక్.. ‘మీ ఆనందం మీదేనా? నేను ఎలా పోయినా సంబంధంలేదా?’ అంటూ అరుస్తాడు. దాంతో సౌందర్య షాక్ అవుతుంది. ‘పిల్లలు సంబరిపడితే దానికి నేనేం చేశానురా? అయినా మా కోసం నువ్వు ఏం త్యాగాలు చేశావని అంతగా గింజుకుంటున్నావ్? ఒక్కపూట ఆ ఇంట్లో భోజనం చేయమనడం తప్పా?’ అంటుంది సౌందర్య. ‘అంటే నాకు నచ్చని పనులు చేయమని ఎలా అడుగుతారు మమ్మీ.. మీరు మమ్మల్ని చాలా గొప్పగా పెంచారు కదా.. ఆదర్శంగా పెంచారు కదా. ఏం కావాలంటే అది ఎలా అంటే అలా మా ఇష్టాలకు అనుగుణంగానే పెంచారు కదా మమ్మీ? సొంతంగా ఆలోచించే శక్తినీ, నిర్ణయించుకునే హక్కుని ఇచ్చారు కదా.. దాన్ని ఎలా లాక్కుంటారు మీరు?’ అంటూ రగిలిపోతాడు.
ఆనందరావు, సౌందర్యలకు పంచ్
సౌందర్య మాత్రం చాలా కూల్‌గా. ‘ఇప్పుడు ఏం అయ్యిందిరా?’ అంటుంది. ‘ఏమైందా? ఏం అయ్యిందో తెలియదా మమ్మీ.. దాని ఇంటికి నన్ను ఎందుకు లాక్కెళ్లాలి? అసలు దాన్ని ప్రతి సారీ ఎందుకు కలుపుతున్నారు మమ్మీ?’ అంటూ రగిలిపోతాడు. ‘ఒక్కపూట సరదాగా దీప ఇంటికి వెళ్తే తప్పేంట్రా? అక్కడ తింటే తప్పేంట్రా?’ అంటుంది సౌందర్య. వెంటనే కూల్ అయ్యి.. ‘మమ్మీ మనం ముగ్గురం అలా బయటికి వెళ్లి వద్దాం’ అంటాడు. మొదట వద్దు అన్నా.. తర్వాత సరే అంటారు ఆనందరావు, సౌందర్యలు. దాంతో కార్తీక్ ఫోన్ తీసుకుని.. ‘ఒక్కనిమిషం మమ్మీ..’ అంటూ కాల్ చేయబోతాడు. ‘ఈ టైమ్‌లో ఎవరికి రా?’ అంటాడు ఆనందరావు. ‘మౌనితకి.. అంతా కలిసి సరదాగా.. అలా తిరిగి వద్దాం’ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య.. ‘సరదాగా మేము మౌనితతో తిరిగి రావడం ఏంటీ నాన్‌సెన్స్’ అంటుంది. వెంటనే కార్తీక్.. ‘మరి సరదాగా నేనే దీప ఇంటికి రావడం ఏంటి మమ్మీ?’ అంటూ రివర్స్ అవుతాడు కార్తీక్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.