కమల్ హాస‌న్ కి వారు నచ్చలేదు

చాలాకాలంగా….రాజకీయాలకు, సినిమావారికి అవినాభావ సంబంధం ఉంది. కొందరు సినిమా వారికి పాలిటిక్స్ లో షైన్ అవుదామని ఉంటుంది. కొందరు నటులు తాము రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటనలు చేస్తుంటారు. వాళ్లలో కొందరు వస్తారు. మరికొందరు రారు. సినిమా తారలకు ఉండే గ్లామర్ వల్ల వాళ్లు పాలిటిక్స్ లోకి రావడంపై రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి. రాజకీయాల్లోకి వచ్చినా, రాకపోయినా కొన్ని సందర్భాల్లో నటులు చేసే ప్రకటనలు వివాదాన్ని రేపుతాయి.

తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన ఒక ప్రకటన పెద్ద దుమారాన్నే రేపింది. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని కొందరు నేతలు అవినీతిపరులని కమల్ హాసన్ ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణపై తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి డి.జయకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కమల్ హాసన్ కు రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం ఉందా? అంటూ మంత్రి జయకుమార్ సవాల్ చేశారు. ‘కమల్ హాస‌న్ కి ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి రావాలి. అప్పుడు రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడొచ్చు“ అని జయకుమార్ అన్నారు. కమల్ అనవసరంగా ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆయనకు ప్ర‌తిప‌క్ష‌ డీఎంకే మద్దతు ఇస్తోందని ఆరోపించారు. మరో తమిళనాడు మంత్రి సీవీ. షణ్ముగం కూడా కమల్ కామెంట్ పై మండిపడ్డారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

అయితే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో సినీనటులు, రాజకీయనాయకులపై ఆరోపణలు చేయడం కొత్త కాదని ప‌లువురు అంటున్నారు. డీఎంకే ర‌థ‌సార‌థి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నటుడు అజిత్ ఆయన సమక్షంలోనే విమర్శించాడని గుర్తు చేస్తున్నారు.