అంజలీ.. నాగార్జునతో పోటీయా?

చిత్రాంగద.. ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైన సినిమా. చిత్రీకరణ పూర్తయి కూడా చాలా కాలమైంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వెళ్లింది. ఓ దశ దాటాక జనాలు ఈ సినిమా గురించి పూర్తిగా మరిచిపోయారు. ఐతే ఇక విడుదలే కాదనుకున్న ఈ సినిమా ఉన్నట్లుండి వార్తల్లోకొచ్చింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఫిబ్రవరి 10న ‘చిత్రాంగద’ ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఆ రోజు అక్కినేని నాగార్జున సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదలకు సిద్ధమవుతున్నా.. దానికి పోటీగా తమ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యారు ‘చిత్రాంగద’ నిర్మాతలు.

‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అంజలి ప్రధాన పాత్రలో నటించింది. జయప్రకాష్.. రాజా రవీంద్ర.. సప్తగిరి.. బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ నిర్మించాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో మేజర్ పార్ట్ అమెరికాలోనే చిత్రీకరించడం విశేషం. కథ కూడా అమెరికా నేపథ్యంలోనే సాగుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తీసిన సినిమా అని సమాచారం.

ఆ మధ్య రిలీజైన ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించింది. కాకపోతే చాన్నాళ్ల పాటు వార్తల్లో లేకపోవడం వల్ల జనాల్లో ఆసక్తి పోయింది. అంజలికి తమిళంలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ‘చిత్రాంగద’ చిత్రాన్ని ‘యార్ నీ’ పేరుతో తమిళంలోకి కూడా అనువాదం చేశారు. అక్కడ కూడా ఒకేసారి విడుదల చేస్తారట. మరి ఈ సినిమా అంజలికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.with.