బాహుబలి-2 ఇంకొక్క 8 కోట్లు వస్తే..

‘దంగల్’తో పోలిక సంగతి ఎందుకు కానీ.. ఓసారి ‘బాహుబలి: ది కంక్లూజన్’ లెక్కలే చూద్దాం. నాలుగు వారాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఏరియాల వారీగా నమ్మశక్యం కాని ఫిగర్స్ నమోదు చేసింది ‘బాహుబలి-2’. 24 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1557 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.
తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ మార్కుకు అత్యంత చేరువుగా ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి రాజమౌళి విజువల్ వండర్ రూ.292 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.  షేర్ రూ.187.4 కోట్లు వచ్చింది. గ్రాస్ రూ.300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి కానీ.. షేర్ రూ.200 కోట్లకు చేరడం కష్టమేనేమో.

తెలంగాణలో రూ.63.6 కోట్ల షేర్ సాధించిన బాహుబలి-2 గ్రాస్ విషయంలో సెంచరీ కొట్టేయడం వివేషం. ఇక్కడ రూ.107 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. సీడెడ్లో రూ.33 కోట్ల షేర్.. రూ.43 కోట్ల గ్రాస్ వసూలైంది. ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లో కలిపి రూ.142 కోట్ల గ్రాస్.. రూ.91 కోట్ల షేర్ వచ్చింది. కర్ణాటక, తమిళనాడుల్లోనూ గ్రాస్ రూ.100 కోట్లు దాటింది. కర్ణాటకలో రూ.106.6 కోట్లు, తమిళనాడులో రూ.124.5 కోట్లు వసూలయ్యాయి.

కేరళలో రూ.66 కోట్లు వచ్చాయి. ఇండియాలోని మిగతా రాష్ట్రాలన్నీ కలిపి రూ.691 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఇండియా మొత్తంలో ఈ చిత్రం రూ.1280 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. షేర్ రూ.605 కోట్లు కాగా.. నెట్ వసూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటడం గమనార్హం. అమెరికాలో ఇప్పటిదాకా రూ.131.7 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి-2 మిగతా దేశాల్లో రూ.146 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రూ.1557.5 కోట్ల గ్రాస్.. రూ.767 కోట్ల షేర్‌తో తిరుగులేని స్థానంలో ఉంది బాహుబలి-2.