రివ్యూలు చూసి ఫోన్లు చేయలేదట

దర్శకుడు సంపత్ నంది.. హీరో గోపీచంద్ కెరీర్లకు చాలా కీలకమైన సినిమా ‘గౌతమ్ నంద’. ఈ సినిమాపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశల్ని నిలబెట్టలేకపోయింది ‘గౌతమ్ నంద’. నెగెటివ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం.. అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

ఐతే సినిమా విడుదలైన వారం రోజులకు ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి.. అందరూ చెప్పే మాటలే చెప్పింది. ‘గౌతమ్ నంద’ ఆరు రోజుల్లో రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వివరించాడు నిర్మాత. హీరో గోపీచంద్ కూడా సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం ‘గౌతమ్ నంద’ గురించి ముందు కొంచెం నిజాయితీగానే స్పందించాడు.

‘గౌతమ్ నంద’కు తొలి రోజు తాము ఆశించిన రెస్పాన్స్ రాలేదని సంపత్ నంది తెలిపాడు. రివ్యూలు.. రేటింగ్స్ నిరాశ కలిగించాయని.. అందువల్లే తొలి రోజు సాయంత్రం వరకు తన మిత్రులు, సన్నిహితులు కూడా తనకు కాల్స్ చేయలేదని సంపత్ తెలిపాడు. బహుశా అందుకు రివ్యూలే కారణం కావచ్చని సంపత్ తెలిపాడు. ఐతే సాయంత్రం తర్వాత నెమ్మదిగా తనకు కాల్స్ మొదలయ్యాయని చెప్పాడు.

తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కథ పరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా ‘గౌతమ్ నంద’నే అని సంపత్ తెలిపాడు. తనకు తన తండ్రి.. తన కుటుంబానికి సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి సాంబశివరావు స్ఫూర్తి అని.. వాళ్లిద్దరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చిందని.. అది తనకెంతో సంతోషం కలిగించిన విషయమని సంపత్ తెలిపాడు.