గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్‌..మ‌నోళ్ల‌కు గొప్ప తీపిక‌బురు

అమెరికాకు విదేశీయుల వలసల సంఖ్యను సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన ‘రీఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రైస్‌)’ బిల్లుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం సమ్మతి తెలిపారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా పౌరసత్వమైన ‘గ్రీన్‌కార్డు’ల జారీ విధానంలో అనేక మార్పులు వస్తాయని, వలసలు సగానికి తగ్గుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఉన్నత చదువులు చదివి, ఉత్తమ నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారత్‌కు చెందిన యువతకు ఇది తీపికబురేనని చెప్తున్నారు.

ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీకి లాటరీ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైస్‌ చట్టం అమల్లోకి వస్తే పాయింట్ల పద్ధతిని అవలంబిస్తారు. చదువు, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, అధిక జీతం కలిగిన జాబ్‌ ఆఫర్స్‌, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లు కేటాయిస్తారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ‘రైస్‌ చట్టంతో విదేశీయులకు గ్రీన్‌కార్డ్‌ అందించే విధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయి. తక్కువ నైపుణ్యాలు ఉన్నవారి వలసలు ఆగుతాయి. ఫలితంగా స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరిగి, దేశంలోని పేదరికం తగ్గుముఖం పడుతుంది. ఖర్చులూ తగ్గుతాయి. చదువు, నైపుణ్యం కలిగిఉన్న వారికి, వారి కుటుంబాలకు రైస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది’ అని పేర్కొన్నారు. విదేశీయుల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న అమెరికన్లకు ఈ చట్టం అండగా నిలుస్తుంది` అని చెప్పారు.

ప్రస్తుతం అమెరికా ఏటా పదిలక్షల మంది విదేశీయులను లాటరీ ద్వారా ఎంపిక చేసి గ్రీన్‌ కార్డులు అందిస్తోంది. దాదాపు 50 ఏళ్లుగా అమలులో ఉన్న ఈ విధానం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ కలుగుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. గ్రీన్‌కార్డ్‌ పొందుతున్నవారిలో ఉన్నత చదువు, ఉత్తమ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్తున్నారు. ప్రతి 15 మందిలో ఒక్కరు మాత్రమే తమ నైపుణ్యాలతో గ్రీన్‌కార్డ్‌ సంపాదించుకుంటున్నారని, అమెరికాలో నివసిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరిస్తున్నారు. మిగతావారు అమెరికాకు భారంగా మారుతున్నారన్నారు. రైస్‌ చట్టం ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

రైస్‌ విధానం భారతీయులకు ఎంతగానో ఉపకరిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌ నుంచి అమెరికాకు వెళ్తున్నవారిలో ఇంగ్లిష్‌పై పట్టు, ఉన్నత చదువు, ఉత్తమ నైపుణ్యాలు ఉన్నవారే అత్యధికంగా ఉంటున్నారని వారు తెలిపారు. భారతీయ యువతకు ఇంగ్లిష్‌పై మంచి పట్టు ఉన్నదని, నైపుణ్యాల పరంగా ఇతర దేశాల వారితో పోల్చితే ముందువరుసలో ఉంటారని పలు అమెరికన్‌ కంపెనీలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అమెరికాకు చెందిన పలు అగ్రశ్రేణి కంపెనీల్లోని ఉన్నత పదవుల్లో భారతీయులు కొనసాగడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైస్‌ చట్టం అమల్లోకి వస్తే ఇతరులతో పోల్చితే భారతీయ యువతకు గ్రీన్‌కార్డ్‌ పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వివరిస్తున్నారు.