ఆ ఫస్ట్ లుక్ ఒరిజినల్.. నమ్మండి

తమిళ స్టార్ హీరో అజిత్ ఈ మధ్య బాగా బద్నాం అయిపోయాడు. అజిత్ కొత్త సినిమా ‘వివేగం’కు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ పెద్ద దుమారమే రేపింది. అందులో చూపించిన అజిత్ సిక్స్ ప్యాక్ లుక్ వీఎఫ్ఎక్స్‌తో చేసిందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే నడిచింది. అజిత్ యాంటీ ఫ్యాన్స్ ఈ ఫస్ట్ లుక్ మీద బోలెడన్ని జోకులు పేల్చారు. అది ఒరిజినల్ లుక్ అయితే.. అజిత్ వర్కవుట్ వీడియో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

అజిత్ అభిమానులు కౌంటర్ అటాక్ చేసినప్పటికీ.. అజిత్ లుక్ చూస్తే మాత్రం సామాన్య జనాలకు కూడా అది ఒరిజినలా కాదా అనే విషయంలో చాలా సందేహాలు నెలకొన్నాయి. ఐతే ‘వివేగం’ టీం నుంచి ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు ఈ చిత్ర దర్శకుడు శివ.. అజిత్ లుక్ విషయమై స్పందించాడు. అజిత్ ఫస్ట్ లుక్ ఒరిజినల్ అని.. అందులో వీఎఫెక్స్‌ ఎఫెక్టేమీ లేదని స్పష్టం చేశాడు.

త్వరలోనే ‘వివేగం’ సినిమాకు సంబంధించి మరో లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు శివ వెల్లడించాడు. సినిమా టీజర్ కూడా త్వరలోనే వస్తుందని తెలిపాడు శివ. అజిత్ కెరీర్లోనే ‘వివేగం’ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని.. ఈ సినిమా షూటింగ్ తొమ్మిది దేశాల్లో చేశామని.. త్వరలోనే మరో దేశానికి వెళ్తున్నామని శివ తెలిపాడు. తన కెరీర్లో అత్యంత కష్టపడి పని చేస్తున్నది ఈ సినిమాకేనని అన్నాడు శివ. ‘వీరం’, ‘వేదాళం’ తర్వాత అజిత్-శివ కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ‘వివేగం’. ఈ చిత్రాన్ని విజయ్ పుట్టిన రోజైన జులై 22న రిలీజ్ చేయాలని చూస్తుండటం విశేషం.