ఫ్రెషర్స్ కు పండగే పండగ..

గతంలో ఉద్యోగాలు దొరకడమే గగనంగా ఉండేది. ఒకవేళ వచ్చినా.. ఆరువేలు, పదివేలు అంటూ బేరాలాడేవారు. కానీ మెల్లగా పరిస్థితి మారింది. ఇప్పుడు ఫ్రెషర్స్ కు కూడా ఘనమైన ప్యాకేజీ అందుతోంది. ఇప్పటిదాకా ఎక్స్ పీరియన్స్ అంటూ బిగదీసుకున్న కంపెనీలు కూడా.. ఇప్పుడు ఫ్రెషర్స్ కు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.

ఆరు లక్షలకు పైగా ప్యాకేజీ ఉండే ఫ్రెషర్స్ ఉద్యోగాలు.. ఏడాదిలో 85 శాతం పెరిగాయని ఓ జాబ్ సర్వే తేల్చింది. దీంతో ఇక బయటికొచ్చే ఫ్రెషర్స్ పంట పండినట్లేనని భావిస్తున్నారు. మన దేశంలో ఈ తరహా ఉద్యోగాలకు ఏకంగా 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తేలింది.

అన్నింటిలోకీ గిరాకీ ఉన్న ఉద్యోగమంటే.. ఎప్పటిలాగే సాఫ్ట్ వేర్ డెవలపర్ జాబే. మొత్తం దరఖాస్తుల్లో వీటి కోసం వచ్చేవి ఎక్కువ శాతం ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్, సేల్స్ సెక్టార్ సెకండ్ ప్లేస్ లో ఉంది. కొంతకాలంగా ఐటీ కంటే నాన్ ఐటీ సెక్టారే ఎక్కువ మందికి జాబ్స్ తెచ్చిపెడుతోంది.

డాటా, డాటా సైన్స్ రంగంలో డాటా అనలిస్ట్, డాటా సైంటిస్ట్, డాటా ఇంజినీరింగ్ ఉద్యోగాలు గతంతో పోలిస్తే.. ఈసారి 30 శాతం పెరిగాయి. ఈ సర్వే వచ్చిన తర్వాత ఫ్రెషర్స్ జాబ్స్ కోసం త్వరపడుతున్నారు. మళ్లీ ఎక్కువరోజులైతే.. జాబ్స్ అన్నీ ఫిల్లైపోతాయని కలవరపడుతున్నారు.