కాటమరాయుడు.. అమెరికాలోనూ అదే మోత

ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది ‘కాటమరాయుడు’. తెలుగు రాష్ట్రాల్లో  ఇప్పటిదాకా ‘బాహుబలి’ మినహా ఏ సినిమా లేనంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. కనీసం 1500 థియేటర్లలో సినిమా విడుదలవుతుందని భావిస్తున్నారు. అందులోనూ తొలి రోజు అయితే థియేటర్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

‘కాటమరాయుడు’ జోరు ఇక్కడే కాదు.. అమెరికాలో సైతం మామూలుగా ఉండబోదని అక్కడి ట్రెండ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఇప్పటికే 250 లొకేషన్లలో స్క్రీన్స్ బుక్కయిపోవడం విశేషం. ఇది నాన్-బాహుబలి రికార్డు. ఇంకా రిలీజ్ సమయానికి మరిన్ని స్క్రీన్లు యాడ్ అయ్యే అవకాశముంది. ఇప్పటిదాకా మరే తెలుగు సినిమానూ ఇన్ని స్క్రీన్లలో రిలీజ్ చేయలేదు. ఈ లొకేషన్లన్నింటిలో ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్ టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా నెల రోజులుగా డల్లుగా ఉంది. ‘నేను లోకల్’, ‘ఘాజీ’ మినహాయిస్తే ఏ సినిమాలూ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదు. సరైన సినిమా కోసం అక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కాటమరాయుడు’ వాళ్ల ఆకలి తీర్చేస్తుందని భావిస్తున్నారు.

అమెరికాలో సైతం ‘కాటమరాయుడు’ నాన్-బాహుబలి ప్రిమియర్.. డే-1.. వీకెండ్ రికార్డుల్ని బద్దలు కొట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రిమియర్లతోనే ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకునేందుకు ఆస్కారముంది.