క్రిష్‌-4.. ప‌ట్టాలెక్కేసిన‌ట్లే

ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్‌కు అత్యంత ఇష్ట‌మైన లోక‌ల్ సూపర్ హీరో మూవీస్ అంటే.. క్రిష్ సిరీస్‌లోనివే. హాలీవుడ్లో మాదిరి ఒక సూప‌ర్ హీరో పాత్ర‌ను తీసుకుని దాని మీద వ‌రుస‌గా సినిమాలు తీస్తూ మ‌న ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్నాడు రాకేష్ రోష‌న్. ఆయ‌న త‌న‌యుడు హృతిక్ రోష‌న్ భారీగా అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకుంది ఈ సినిమాల‌తోనే.

ముందు కోయీ మిల్ గ‌యా సినిమాను మామూలుగానే తీశారు. అప్ప‌టికి ఫ్రాంఛైజ్ గురించి ఆలోచ‌న‌లేమీ లేవు. కానీ అది చ‌క్క‌టి విజ‌యం సాధించ‌డంతో దానికి కొన‌సాగింపుగా క్రిష్ తీశారు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆపై క్రిష్‌-3తో మ‌రోసారి అభిమానుల మ‌న‌సులు గెలిచారు రాకేష్‌-హృతిక్.

మూడో సినిమా కూడా బాగా ఆడ‌టంతో క్రిష్-4కు అంద‌రూ రెడీ అయిపోయారు. కానీ హృతిక్ వేరే కమిట్మెంట్లతో బిజీ అయిపోవ‌డం.. ఇంత‌లో రాకేష్ రోష‌న్ క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టంతో ఈ సిరీస్‌కు ఇక తెర‌ప‌డిన‌ట్లే అని అంతా అనుకున్నారు. కానీ గ‌త ఏడాది క్యాన్స‌ర్ నుంచి కోలుకున్న రాకేష్‌.. తాను క్రిష్‌-4 తీయ‌బోతున్న‌ట్లు సంకేతాలిచ్చాడు.

తాజాగా ఆయ‌న మ‌రోసారి ఆ ప్రాజెక్టు గురించి అభిమానుల‌కు ఆస‌క్తిక‌ర అప్ డేట్స్ ఇచ్చారు. క్రిష్‌-4కు ఆల్రెడీ క‌థ ఖ‌రారైంద‌ని.. ఈ సినిమాకు స‌న్నాహాలు కూడా మొద‌లుపెట్టామ‌ని.. ఐతే లాక్ డౌన్ కార‌ణంగా బ్రేక్ ప‌డింద‌ని.. అన్నీ స‌ర్దుకుని సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాక సాద్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను మొద‌లుపెడ‌తామ‌ని.. ఇందులో హృతిక్ కాకుండా న‌టించే నటీన‌టులు, ప‌ని చేసే సాంకేతిక నిపుణుల గురించి తర్వాత వెల్ల‌డిస్తామ‌ని.. అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ని విధంగా సినిమా ఉంటుంద‌ని రాకేష్ తెలిపాడు.