ఎన్టీఆర్‌ను వదులుకుంటే వాళ్లకే నష్టం

‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు త్రివిక్రమ్. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు ఆయన ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి రాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లాంఛనమే అని భావిస్తున్నారు. కానీ ఇంతలోనే మహేష్ బాబు లైన్లోకి వచ్చాడు. వంశీ పైడిపల్లి ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యాక అయోమయంలో పడ్డ మహేష్.. రకరకాల ఆప్షన్లు పరిశీలిస్తున్నాడు.

పరశురామ్ సినిమాను ఓకే చేసినట్లే చేసి ఈ లాక్ డౌన్ టైంలో మిగతా వాళ్లను కూడా టచ్ చేస్తున్నాడు. మధ్యలో త్రివిక్రమ్‌కు, అతడికి కొంచెం గ్యాప్ రాగా.. దాన్ని పక్కన పెట్టి మాటల మాంత్రికుడిని మహేష్ అప్రోచ్ అయ్యాడని.. కుదిరితే ఇద్దరూ కలిసి త్వరలోనే సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎన్టీఆర్ పరిస్థితి ఏంటన్నది అర్థం కావట్లేదు.

ఐతే త్రివిక్రమ్‌కు, కొన్నేళ్లుగా ఆయన మాతృ సంస్థగా మారి వరుసగా తన సినిమాల్ని నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ సంస్థకు ఎలా చూసినా ఎన్టీఆర్‌తో సినిమా చేయడం లాభసాటి అన్నది స్పష్టం. ఎందుకంటే వాళ్లకు ఎన్టీఆర్ మామూలుగా దొరకట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీలో నటించి దాని ద్వారా వచ్చే ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్‌ కలుపుకుని వాళ్ల చేతుల్లోకి వస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా మంచి ఫాంలో ఉన్నాడు. పైగా తారక్‌తో ఆయన చేసిన ‘అరవింద సమేత’ మంచి విజయాన్నందుకుంది. ఈ నేపథ్యంలో ఈ కలయికలో వచ్చే సినిమాపై అంచనాలే వేరుగా ఉంటాయి. దానికి బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.

ఇక మహేష్ బాబుతో సినిమా అంటే లేని పోని తలనొప్పులనేది కొన్నేళ్లుగా అతడి సినిమాల వరుస చూస్తే అర్థమవుతుంది. మార్కెట్‌కు మించి పారితోషకం తీసుకుంటాడు. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువుంటుంది. కానీ బిజినెస్ మరీ ఎక్కువ జరగదు. గత కొన్నేళ్లలో అతడితో సినిమాలు చేసిన నిర్మాతలకు పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, చినబాబులకు ఈ సమయంలో మహేష్ కంటే తారక్‌తో సినిమా చేస్తేనే చాలా మంచిదని.. ఒకవేళ మహేష్ బాబు సినిమానే లైన్లో పెట్టి.. దాని వల్ల తారక్ కొంత కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చి, వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే మంచి అవకాశాన్ని మిస్సవుతారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.