95 గంట‌ల్లో 33 గంట‌లు బోయింగ్ విమానంలోనే !

ప‌ని చేయ‌టం ఒక ఎత్తు. ఆ ప‌నిని గొప్ప‌గా చెప్పుకోవ‌టం మ‌రో ఎత్తు. తాజాగా దేశ ప్ర‌ధాని మోడీలో ఈ రెండూ పుష్క‌లంగా క‌నిపిస్తాయి. కాకుంటే.. తాను చేసిన ప‌నిని త‌న‌కు తానుగా చెప్పుకోవ‌టం అస్స‌లు చేయ‌రు. ఎవ‌రితో ఎలా చెప్పించుకోవాలో ఆయ‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌నే చెప్పాలి. త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల కార‌ణంగా వ‌చ్చే మైలేజీకి ఆయ‌న కొత్త సొగ‌సులు అద్దుతున్నారు. మ‌రే ప్ర‌ధాని కూడా త‌న‌కు సాటి రార‌న్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌చారం సాగుతోంది.

త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి స‌రికొత్త కోణాన్ని కొన్ని మీడియా సంస్థ‌లు ఆస‌క్తిక‌రంగా తెర మీద‌కు తీసుకురావ‌టం.. వాటిని అందిపుచ్చుకొని మిగిలిన మీడియా సంస్థ‌లు హోరెత్తించ‌టంతో మోడీ కీర్తి అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మూడు దేశాల ప‌ర్య‌ట‌న ముగించుకొచ్చిన ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఒక ఆస‌క్తిక‌ర కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్ని ఎవ‌రి నుంచి ఎలా వ‌చ్చిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట మీడియాలో వినిపిస్తోంది.ప‌ర్య‌ట‌న కోసం మోడీ ఖ‌ర్చు చేసిన స‌మ‌యం 95 గంట‌లైతే.. అందులో ఒక వంతు స‌మ‌యాన్ని ఆయ‌న విమానంలో ప్ర‌యాణానికి వెచ్చించిన కొత్త కోణం తెర‌పైకి వ‌చ్చింది. మొత్తం 95 గంట‌ల్లో 33 గంట‌లు ఎయిరిండియా బోయింగ్ విమానంలోనే మోడీ గ‌డిపిన‌ట్లుగా అంకెల‌తో స‌హా మోడీ గొప్ప‌త‌నాన్ని కీర్తించే కార్య‌క్ర‌మం షురూ అయ్యింది.
సాధార‌ణంగా దేశ ప్ర‌ధాని త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొచ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌లో సాధించిన విజ‌యాల మీద విశ్లేష‌ణ సాగుతుంది. మోడీ విష‌యానికి వ‌స్తే అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. దౌత్య‌ప‌రంగా మోడీ సాధించిన విజ‌యాల మీద చ‌ర్చ కంటే.. స‌గ‌టుజీవి దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించే అంశాల మీద‌న ప్ర‌చారం సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

పోర్చుగ‌ల్ టు అమెరికా.. అక్క‌డి నుంచి నెద‌ర్లాండ్స్ ప్ర‌యాణించిన మోడీ.. ఈ సంద‌ర్భంగా ఆయా దేశాధినేత‌ల‌తో భేటీ అయ్యారు. అదే స‌మ‌యంలో అక్క‌డి ప్ర‌వాస భార‌తీయుల్ని క‌ల‌వ‌ట‌మే కాదు.. స‌ర‌దా టూర్‌కు వ‌చ్చిన భార‌త సెల‌బ్రిటీల‌ను కూడా క‌లుసుకొని వారిని సంతోష‌ప‌డేలా చేశారు.

త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో 33 భేటీల్లో పాల్గొన్న ఆయ‌న‌.. మొత్తం నాలుగు రాత్రుల్లో కేవ‌లం రెండు రాత్రులు మాత్ర‌మే విశ్రాంతి తీసుకుంటే.. మిగిలిన రాత్రుళ్లు ఆయ‌న విమానంలోనే గ‌డిపేయ‌టం గ‌మ‌నార్హం. ప‌గ‌లు దేశాధినేత‌ల‌తో భేటీ కావ‌టం.. రాత్రిళ్లు మ‌రో దేశానికి ప్ర‌యాణం కావ‌టంతో ఆయ‌న భారీగా స‌మ‌యాన్ని ఆదా చేశారు. ఇప్పుడీ యాంగిల్ లో మోడీ గొప్ప‌త‌నాన్ని కీర్తించేస్తున్నారు. చేసిన ప‌నిని ఎంత గొప్ప‌గా.. భిన్నంగా ప్రచారం చేసుకోవాలో మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంద‌రు వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తోంది.