నెక్ట్స్‌: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌

రాష్ట్రప‌తి ఎన్నికలకు సంబంధించిన హ‌డావుడి ఒక కొలిక్కి రాక ముందే.. మ‌రోవైపు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గంట మోగించింది. రాష్ట్రప‌తి  ప‌ద‌వి త‌ర్వాత మ‌రో అత్యున్న‌త ప‌ద‌వికి సంబంధించిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌ను తాజాగా ఈసీ చేసింది.

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ను ఆగ‌స్టు 5న నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా ఈసీ ప్ర‌క‌టించింది. అదే రోజు ఓట్ల లెక్కింపు జ‌రుపుతుంద‌ని వెల్ల‌డించారు. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ చూస్తే.. జులై 18లోపు నామినేష‌న్ దాఖ‌లు చేయాల‌ని.. 19న నామినేష‌న్ ప‌త్రాల ప‌రిశీల‌న ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ న‌జీమ్ జైదీ పేర్కొన్నారు. నామినేష‌న్ స‌మ‌యంలో అభ్య‌ర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15వేలు చెల్లించాల‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఉప రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న హ‌మీద్ అన్సారీ ప‌ద‌వీ కాలం ఆగ‌స్టు 10న ముగియ‌నుంది. 2007.. 2012లో రెండుసార్లు ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఎన్నికైన ఆయ‌న ప‌దేళ్లుగా ఆ ప‌ద‌విలో ఉన్నారు.

మ‌రోవైపు జులై 17న రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం జులై 20న జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక కేవ‌లం నామ‌మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన మెజార్టీకి మించిన బ‌లం మోడీ అండ్ కోకు ఉంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి కూడా బీజేపీ అభ్య‌ర్థి సులువుగా చేజిక్కించుకునే వీలుంది. ఈ మ‌ధ్య‌నే ఈ ప‌ద‌వికి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు పేరు వినిపిస్తోంది.