ఎన్టీఆర్ షరతులు పెట్టాడట

జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెర అరంగేట్రం ఖరారైపోయింది. నిన్ననే మా టీవీ వాళ్లు ఎన్టీఆర్ ముఖచిత్రంతో ఈ ‘బిగ్ బాస్’ షో పోస్టర్ కూడా వదిలేశారు. సూటేసుకున్న ఎన్టీఆర్ తనదైన శైలిలో కన్ను గీటుతూ ఈ షోకు రెడీనా అని ప్రేక్షకుల్ని అడిగేశాడు.

ఒకట్రెండు నెలల్లోనే ఈ షో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ షోకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న కబురేంటంటే.. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే షో ఆరంభ ఎపిసోడ్ల చిత్రీకరణ హైదరాబాద్ లో జరగబోదట. ఇందుకోసం ముంబయిలోని ప్రముఖ స్టూడియోకు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇది ఎన్టీఆర్ పెట్టిన షరతే అంటున్నారు.

తన బుల్లి తెర అరంగేట్రం టాప్ క్లాస్ గా ఉండాలని ఆశిస్తున్న ఎన్టీఆర్.. ముంబయి స్టూడియో.. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్.. ఇలాంటి కొన్ని షరతులు పెట్టాడట. ఇప్పటికే ఈ షో కోసం ఎన్టీఆర్ కు భారీగా పారితోషకం సమర్పించుకుంటున్న మా టీవీ వాళ్లు.. ఈ అదనపు భారీ ఖర్చులకూ ఓకే చెప్పారట. ‘బిగ్ బాస్’ షోకు తెలుగులో మంచి ఆదరణ గ్యారెంటీ అన్న భరోసాతోనే ఎంత ఖర్చుకైనా వెనుకాడట్లేదని సమాచారం.

మాటీవీ వాళ్లే చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూటింగ్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఐతే ‘బిగ్ బాస్’ షో మొత్తం ముంబయి స్టూడియోల్లోనే షూటింగ్ అంటే కష్టం. ఇంట్రడక్షన్ మాత్రం అక్కడ తీసి.. పార్టిసిపెంట్స్ ఓ ఇంట్లో గడిపే తంతు మొత్తాన్ని ఇక్కడే హైదరాబాద్ లో ఏదైనా ఇంటిని సెలక్ట్ చేసుకుని షూట్ చేసే అవకాశముంది.