ఆ సూప‌ర్ స్టార్ డ‌బుల్ థ‌మాకా!

అగ్ర‌హీరోల సినిమాల కోసం వారి అభిమానులే కాదు సినిమా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఒక‌ప్పుడు అగ్ర హీరోలు ఏడాది ఐదు నుంచి ప‌దికి త‌గ్గ‌కుండా సినిమాలు చేసేవారు. అలాంటిది రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేస్తేనే ఎక్కువ‌గా మారింది. కొన్నిసార్లు అయితే.. ఇది కాస్తా ఏడాదిన్న‌ర వ‌ర‌కూ వెళ్లే ప‌రిస్థితి.

ఇదిలాఉంటే.. ఉన్న‌ట్లుండి అగ్ర‌హీరోలంతా రాత్రికి రాత్రి మారిపోయిన‌ట్లుగా.. ఎవ‌రికి వారు త‌మ సినిమాల్ని వేగ‌వంతంగా పూర్తి చేయ‌ట‌మే కాదు.. ఏడాదిలో ఒక‌ట్రెండు కంటే ఎక్కువ సినిమాలు విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకోవ‌టం క‌నిపిస్తోంది.

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ముచ్చ‌టే చూడండి. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే..ఏళ్ల‌కు ఏళ్లు ఆయ‌న అభిమానుల‌తో పాటు.. ప్రేక్ష‌కులు సైతం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయ‌నోసినిమా చేస్తున్నారంటే.. అదో ప్ర‌సాదంగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఏకంగా రెండు సినిమాలు.. అదీ మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో విడుద‌ల‌వుతాయంటే అంత‌కు మించిన ఆనందం ఏముంటుంది?

క‌బాలి త‌ర్వాత ఆయ‌న చేస్తున్న మూవీ శంక‌ర్ రోబో 2.0. ఇదే ఆయ‌న చివ‌రి సినిమా అవుతుంద‌న్న అంచ‌నాలు వినిపించాయి. రాజ‌కీయాల్లోకి త్వ‌ర‌లో వెళ్ల‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న చేసే చివ‌రి సినిమా 2.0గా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఉన్న‌ట్లుండి ఆయ‌న క‌బాలి ద‌ర్శ‌కుడు పా. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో కాలా మూవీకి ఓకే చెప్పేయ‌టం.. అంత‌లోనే సినిమా స్టార్ట్ కావ‌టం జ‌రిగిపోయాయి.

చూస్తుండ‌గానే ముంబ‌యిలో మొద‌టి షెడ్యూల్ పూర్తి అయి.. రెండో షెడ్యూల్ త్వ‌ర‌లో మొద‌లు కానుంది. ర‌జ‌నీ స్పీడ్ చూస్తుంటే..ఈ సినిమాను సెప్టెంబ‌రు నాటికి పూర్తి చేసేసి.. విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.  మ‌రోవైపు శంక‌ర్ 2.0 షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. గ్రాఫిక్స్ వ‌ర్క్ భారీగా ఉండ‌టంతో.. ఆ ప‌నిలో సినిమా ఉంది. ముందుగా అనుకున్న‌ట్లు దీపావ‌ళికి కాకుండా ఈ సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించ‌టం తెలిసిందే.

తాజాగా అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం 2.0 విడుద‌ల జ‌న‌వ‌రికి మారిన నేప‌థ్యంలో.. సెప్టెంబ‌రు నాటికి కాలాను పూర్తి చేసి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ర‌జ‌నీ అభిమానుల‌కు మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండు పండగులుగా చెప్పొచ్చు. త‌న అభిమానుల‌కు ర‌జ‌నీ ఇచ్చే అపురూప‌మైన స్వీట్ గిఫ్ట్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.