షర్మిల ఓటమి నాకు బాధ కలిగించింది

జనసేన పార్టీని స్థాపించి మూడేళ్లయిన సందర్భంగా ఆ పార్టీ అధినేత‌ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పార్టీని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ణతలు తెలిపారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాలను ఆరంభించినట్లు చెప్తూ 2019 ఎన్నికలలో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్మాణం పూర్తయిన తరువాతనే పొత్తులపై ఆలోచిస్తామన్నారు. వామపక్ష పార్టీల వంటి వాటితో పొత్తు అవకాశాలున్నాయని సూచనప్రాయంగా చెబుతూ బలమైన పార్టీ నిర్మాణం ఉన్న పార్టీలతో పోత్తుకు ముందు తమ పార్టీ నిర్మాణం జరగాల్సి ఉందని ప‌వ‌న్ చెప్పారు.

అధికారంలోకి వచ్చినా రాకపోయినా జనసేన ప్రజా సమస్యలపై పని చేస్తూనే ఉంటుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. 60శాతం యువతకే అవకాశం ఉంటుందన్నారు. జనసేనకు బలమైన కార్యకర్తల బలం ఉందన్నారు. పార్టీ ఆలోచనా విధానాలను ప్రజలతో పంచుకునేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించామన్నారు. తాను ఎన్డీయేలో లేనని  పవన్ కల్యాణ్ చెప్పారు. చిరంజీవి జనసేన పార్టీలోకి వచ్చే ఆలోచనే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సర్వేలు అనేవి మారుతూ ఉంటాయని పవన్ కల్యాణ్ అన్నారు. సర్వేలపై ఆధారపడమని, సానుకూల దృక్ఫథంతో క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఉంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పని తీరును దుయ్యబట్టడం భావ్యం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలపైనే జనసేన ప్రధానంగా దృష్టి పెడుతుందని చెప్పారు. అధికారమే లక్ష్యంగా తమ పార్టీ పని చేయదన్నారు. డ‌బ్బు ప్రభావం లేని రాజకీయాలంటే తనకు ఇష్టమని ప‌వ‌న్ చెప్పారు. మణిపూర్ లో ఇరోమ్ షర్మిల పరాజయం బాధ కలిగించిందని ప‌వ‌న్ అన్నారు.