ఇంగ్లీష్‌ అయితే మహేష్‌కి కష్టమే

మహేష్‌, మురుగదాస్‌ల చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రిలీజ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూడు భాషల్లోను ఒకే టైటిల్‌ పెట్టాలని, బాహుబలికి చేసినట్టు యూనిఫామ్‌ బ్రాండింగ్‌ చేయాలని భావిస్తున్నారు. అందుకే మూడు చోట్ల కుదిరే టైటిల్‌నే పెట్టాలని ఆలోచిస్తున్నారు.

ఇంతవరకు టైటిల్‌ ఏంటనేది అనౌన్స్‌ చేయకపోవడానికి కారణమదే. చాలా టైటిల్స్‌ వినిపించిన తర్వాత లేటెస్ట్‌గా ‘స్పైడర్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ టైటిల్‌ని సదరు బ్యానర్‌పై రిజిష్టర్‌ చేయడంతో ఇదే ఫిక్స్‌ అయిపోయిందని అనుకుంటున్నారు. ఇందులో మహేష్‌ స్పైగా నటిస్తున్నాడు కనుక ఈ టైటిల్‌ బాగుంటుందనేది రూపకర్తల ఫీలింగ్‌.

కాకపోతే ఈ టైటిల్‌తో ఒక చిక్కుంది. ఈ టైటిల్‌ పెట్టినట్టయితే తమిళనాడులో ఈ చిత్రానికి పన్ను రాయితీ వుండదు. తమిళ చిత్రాలకి తమిళ పేర్లు పెడితే వంద శాతం పన్ను రాయితీ ఇస్తారు. అందుకే ప్రతి సినిమాకీ ఎలాగోలా తమిళ పేరుని పెట్టడానికే చూస్తుంటారు. తమిళంలో డైరెక్టుగా రూపొందుతోన్న చిత్రం కనుక అక్కడ పన్ను రాయితీ విషయంలో ఈ చిత్ర నిర్మాతలు రాజీ పడకపోవచ్చు. అందుకే స్పైడర్‌ కాకుండా మరో టైటిల్‌ అనౌన్స్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.