వర్మ ‘న్యూక్లియర్’ కథేంటి?

ఇండియాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో కూడా ఒక ఫీచర్ ఫిలిం (ఐస్ క్రీమ్) తీసి సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే మిగతా సినిమాలు కూడా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. అలాంటి వర్మ త్వరలో రూ.340 కోట్లతో ఒక ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నాడు. అదే.. న్యూక్లియర్.

రెండు నెలల కిందటే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది ‘సీఎంఏ గ్లోబల్’ సంస్థ. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్తుందని.. రెండు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటుందని తెలిపాడు వర్మ. తాజాగా ఈ సినిమా కథను కూడా విప్పి చెప్పేశాడు వర్మ. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు..

”న్యూక్లియర్ టెర్రరిజం నేపథ్యంలో సాగే కథ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం చర్చనీయాంశంగా మారింది. రోజూ నిద్ర లేవగానే ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడి గురించి వింటూనే ఉన్నాం. విమానాలతో టవర్లను కూల్చేయడం.. రోడ్డు మీద వెళ్తున్న ప్రజలను ట్రక్కుతో చిదిమేయడం లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘న్యూక్లియర్‌’ సాగుతుంది. ఒక ఆటంబాంబు వల్ల ముంబయి స్ట్రగుల్ అవుతుంది. అది పేలితే మూడో ప్రపంచయుద్ధం వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో భారత్, పాకిస్థాన్‌లను ఒప్పించి.. దాన్ని నిర్వీర్యం చేయడానికి అమెరికా తన బలగాలను మోహరిస్తుంది. తర్వాత ఏమైందన్నదే ఈ కథ.

‘సర్కార్‌ 3’ తర్వాత.. అంటే 2017 మేలో ‘న్యూక్లియర్‌’ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇండియాతో పాటు అమెరికా, చైనా, రష్యా, ఇండోనేషియల్లో షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అమెరికన్లు, చైనీయులు, రష్యన్లు, బ్రిటిషర్లు, యెమనీస్‌ ఇందులో నటిస్తారు. సినిమా ఇంగ్లిష్ లోనే ఉంటుంది” అని వర్మ తెలిపాడు.