ఫోన్ చేసి సంపూను బూతులు తిట్టేవాళ్లట

బర్నింగ్ స్టార్ అంటూ తనకు తాను ఓ బిరుదు ఇచ్చుకుని రంగంలోకి దిగాడు సంపూర్ణేష్ బాబు. కేవలం సోషల్ మీడియాను బేస్ చేసుకుని పాపులారిటీ సంపాదించుకున్న నటుడతను. ముందు అందరూ సంపూ తీరు చూసి నవ్వుకున్నారు.. లైట్ తీసుకున్నారు కానీ.. ‘హృదయ కాలేయం’ సినిమాతో అతనెంత పేరు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే తొలి సినిమాతో అంత పేరు సంపాదించినప్పటికీ.. జనాల నుంచి తిట్లు.. బూతులు మాత్రం తప్పలేదని అంటున్నాడు సంపూ. హీరో అయ్యాక కూడా తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు అతను తెలిపాడు.

”నేను హీరో కాకముందు బంగారం షాపులో పనిచేసేవాడిని. అప్పుడు తీసుకున్న మొబైల్ నంబరే తర్వాత కూడా కొనసాగిస్తున్నాను. హీరో అయిన కొత్తలో ఆ నంబర్‌కు చాలా ఫోన్లు వచ్చేవి. అర్ధరాత్రి సమయంలో కూడా కాల్స్ ఆగేవి కావు. ఫోన్‌ తీస్తే అవతలి వ్యక్తులు విపరీతంగా తిట్టేవారు. ఏరా అసలు నువ్వు హీరో ఎలా అయ్యావురా.. అంటూ బూతులు అందుకునేవారు. నేను ఏమీ మాట్లాడకుండా సైలెంటుగా కాల్ కట్‌ చేసేవాడిని. ఇప్పుడు కూడా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తే తీయట్లేదు” అని సంపూ చెప్పాడు.

ఇక తానెలా హీరో అయ్యానో సంపూ చెబుతూ.. ”మా సిరిసిల్లలో బంగారం షాపులో పని చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చేవాడిని. అనుకోకుండా కృష్ణవంశీ గారి ‘మహాత్మ’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడిని. అందరూ నన్ను డబ్బులు అడిగేవారు. అలాంటి సమయంలో రాజేష్ గారితో పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నాడు. ‘నేనొక చెత్త హీరోని పెట్టి ఓ చెత్త సినిమా చేద్దామనుకుంటున్నా. ఈ సినిమా చూసి జనాలు పిచ్చి తిట్లు తిడతారు. ఈ కథ ఇంతకుముందే కొంతమందికి చెప్పా. వాళ్లకు నచ్చలేదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు’ అనడంత స్టన్నయ్యాను. నువ్వేం చెబితే అది చేస్తానని చెప్పా. అలా  ‘హృదయ కాలేయం’ మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని సంపూ అన్నాడు.