టీడీపీ లో ఏప్పుడెప్పుడు ఎవరెవరు మరణించారంటే

తెలుగుదేశం పార్టీలో ప్రభావవంతమైన లీడర్లు మృతిచెందుతుండడంతో ఆ పార్టీ ఇబ్బంది ఎదుర్కొంటోంది. కీలక నేతల మరణాల కారణంగా అనేక జిల్లాల్లో ఇలాంటి కుదుపులొచ్చాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీని కంచుకోటల్లా తీర్చిదిద్దిన నేతలు  ఆ తర్వాతి కాలంలో రోడ్డు ప్రమాదాల్లోనో, సహజంగానో మృతి చెందుతుండడం ఆ పార్టీకి భారీ నష్టం మిగులుస్తోంది. ఫలితంగా ఆ స్థాయిలో నేతలను ఇప్పటికీ తయారుచేసుకోలేక పార్టీ నాయకత్వం సతమతమవుతోంది.

ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత ధూళిపాళ్ల వీరయ్యచౌదరి గుంటూరు సదస్సు ఏర్పాట్లు చూసి వస్తూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పట్లో గుంటూరులో అగ్రనేతగా ఉన్న చౌదరి మృతి పార్టీకి లోటుగా మారింది. అంతకంటే ముందు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఈలి ఆంజనేయులు క్యాబినెట్ సమావేశానికి హాజరై ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో మరణించారు.

ఎన్టీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు టిడిపి ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడికి స్ఫూర్తిగా నిలిచిన నాటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని పదవిలో ఉండగనే నక్సల్స్ పొట్టనపెట్టుకున్నారు. దానితో తెలంగాణలో ఒక అగ్రనేతను పార్టీ పోగొట్టుకుంది. తర్వాత ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. దూకుడుతోపాటు, కార్యకర్తల కోసం తెగించే నైజం, తనకు అత్యంత విధేయత చూపే మాధవరెడ్డి మరణం వ్యక్తిగతంగా చంద్రబాబునూ కలచివేసింది. లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌లో మాధవరెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధమైన వైనమే తెలుగుదేశంలో తిరుగుబాటుకు కారణమయింది. చంద్రబాబును ఇప్పుడీ స్థాయికి తెచ్చింది.

అంతకంటే చాలాకాలం ముందు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే శివారెడ్డిని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో దారుణంగా హతమార్చారు.  ఇక గంటి మోహనచంద్ర బాలయోగిని దేశ చరిత్రలో తొలిసారి దళిత లోక్‌సభ స్పీకర్‌గా చేసిన కీర్తి పొందిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఆయననూ హెలికాప్టర్ దుర్ఘటన రూపంలో పోగొట్టుకుంది. ఆయన కుటుంబం ఇప్పటికీ రాజకీయాల్లో కనిపించడం లేదు. రాయలసీమలో శివారెడ్డి మరణం తర్వాత పార్టీకి తీవ్ర నష్టం కలిగించినది మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య. అనంతపురం జిల్లాలో పార్టీ ఒక ఫైర్‌బ్రాండ్‌ను కోల్పోయినట్టయింది.

ఆ స్థాయిలో దూకుడు, ప్రత్యర్ధులకు సవాల్ విసిరే గుండెధైర్యం ఉన్న నేత ఇప్పటికీ లేకుండా పోయారు. గుంటూరు జిల్లాలో ఎన్‌జి రంగాను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించిన మాజీ ఎంపి లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదం పార్టీకి లోటుగా మారింది. 1999లో కృష్ణా జిల్లాకు చెందిన యువమంత్రి దేవినేని రమణ రైలు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి లోటుగా మారింది. ఇప్పుడు ఆయన సోదరుడు దేవినేని ఉమ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన స్థాయి దూకుడు కనిపించదు. కృష్ణా జిల్లాలో ఆ స్థాయి నేత ఇప్పటికీ లేకుండా పోయారు.

ఇక తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు, విజయాల్లో చంద్రబాబునాయుడుకు కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్న శ్రీకాకుళం జిల్లా అగ్రనేత, కేంద్రమాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు రోడ్డుప్రమాదం రాజకీయ ప్రత్యర్థులనూ కంటతడి పెట్టించింది. నిరంతర శ్రమ, విధేయత, మంచితనంతో శ్రీకాకుళం నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన ఎర్రన్న మరణం తర్వాత నెలకొన్న ఖాళీని ఇప్పటికీ భర్తీ చేసేవారు లేకుండా పోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులు, ఎంపీలు ఎంతమంది ఉన్నా, ఎర్రన్న స్థాయిలో పార్టీ జెండా దేశ రాజధానిలో ఎగురవేయడంలో విఫలమయ్యారన్నది నిర్వివాదం. అప్పట్లో ఢిల్లీలో ఎర్రన్న పార్టీకి చిరునామాగా ఉండేవారు. తాజాగా కర్నూలు జిల్లాలో పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పార్టీని కుంగదీసింది.