త‌మిళ‌నాడులో అస‌లేం జ‌రుగుతోందంటే..

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌లలిత వార‌స‌త్వ పోరు తారాస్థాయికి చేరింది. సాక్షాత్తు అమ్మ స‌మాధి నుంచి సెల్వం తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేశారు.అనంత‌రం ఆయ‌న‌పై చిన్నమ్మ శ‌శిక‌ళ మండిప‌డింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో సీక్రెట్ బ‌స్సుయాత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది. మ‌రోవైపు ఈ ప‌రిణామాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు త‌మిళ‌నాడులో ఏం జ‌రిగిందంటే..

— మంగ‌ళ‌వారం  రాత్రి 9 గంటల ప్రాంతంలో మందీమార్బలం లేకుండా ఒక్కడే వచ్చిన పన్నీర్‌సెల్వం.. దాదాపు 40 నిమిషాలపాటు అమ్మ సమాధి వద్ద యోగముద్రలో గడిపారు! ఆ తర్వాత బాంబుల్లాంటి మాటలతో మౌనం వీడారు! జయలలిత చనిపోయిన తర్వాత పేరుకు తనను సీఎంగా నియమించినా.. అడుగడుగునా అవమానించారని, చివరకు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని సంచలనాత్మక ప్రకటన చేశారు. తనకేమైనా జరిగితే సీఎం పదవి చేపట్టాలని అమ్మే కోరారని చెప్పిన పన్నీర్‌సెల్వం.. కార్యకర్తలు కోరుకుంటే తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని చెప్పారు.

– మెరీనా బీచ్ పరిణామాలతో అప్రమత్తమైన శశికళ.. హుటాహుటిన పోయస్ గార్డెన్స్‌లో అత్యవసర క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. శశికళకు మద్దతుగా ఆమె నివాసానికి దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారని సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత పన్నీర్‌సెల్వాన్ని పార్టీ కోశాధికారి పదవి నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

—త‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించిన నేప‌థ్యంలో సెల్వం మీడియాతో మాట్లాడారు. త‌మిళనాడు సీఎం జయలలిత మృతిపై సందేహాలున్నాయని, ఈమేరకు ఆమె మృతిపై సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీరు సెల్వం వెల్లడించారు. ప్రజల్లో జయ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఉందని తెలిపారు. శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడు పార్టీకి ద్రోహం తలపెట్టలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాను పార్టీ విధేయుడిగా ఉన్నానని గుర్తు చేశారు. పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. జయలలిత తమకు దేవతతో సమానమని పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ పాత్ర లేదని తెలిపారు. ప్రజలు కోరితే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. అసెంబ్లీలో తాను బల నిరూపణ చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ చెన్నై వస్తే తాను వెళ్లి కలుస్తానని పేర్కొన్నారు.

—మంగ‌ళ‌వారం రాత్రి అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీరుసెల్వం తిరుగుబావుటా ఎగ‌రేయ‌డంతో కంగుతిన్న శ‌శిక‌ళ‌.. బుధ‌వారం ఉద‌యం బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మొత్తం 134 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేల‌కు గాను.. 131 మంది హాజ‌ర‌వ‌డం గ‌మ‌నార్హం. దీన్నిబట్టి ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు త‌న‌కే ఉంద‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

సెల్వం కామెంట్ల అనంత‌రం పార్టీ ఎమ్మెల్యేల‌తో చెన్నైలో స‌మావేశ‌మైన త‌ర్వాత శ‌శిక‌ళ‌ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీని విడ‌దీసేందుకు కుట్ర జ‌రిగిన‌ట్లు శ‌శిక‌ళ ఆరోపించారు. సీఎం ప‌న్నీరు సెల్వ‌మే పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమె విమ‌ర్శించారు. డీఎంకేతో ప‌న్నీరు చేతులు క‌లిపిన‌ట్లు ఆమె అన్నారు. జ‌య‌ల‌లిత మార్గంలోనే న‌డుస్తామ‌ని ఈ సందర్భంగా శశికళ స్ప‌ష్టం చేశారు. ప‌న్నీరు సెల్వం కుట్ర‌దారుడు, ద్రోహి అని విమ‌ర్శించారు. ప‌న్నీరు సెల్వం అమ్మ‌ను కూడా అవ‌మానించార‌న్నారు. అమ్మను కూడా వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర‌లు జ‌రిగిన‌ట్లు శ‌శిక‌ళ చెప్పారు. 131 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు మాకే ఉన్న‌ట్లు ఆమె స్ప‌ష్టం చేశారు.  జ‌య‌ల‌లిత మృతిచెందిన‌ప్పుడు తాను ప‌ద‌విని స్వీక‌రించే స్థితిలో లేన‌ని శ‌శిక‌ళ అన్నారు. గ‌త 33 ఏళ్లుగా తాను జ‌యతో స‌న్నిహితంగా ఉన్న‌ట్లు చెప్పారు. కుట్ర‌ను తాను స‌హించ‌బోన‌న్నారు. ప‌న్నీరు సెల్వం త‌ప్పుల‌ను అనేక‌సార్లు అమ్మ క్ష‌మించార‌ని ఆమె గుర్తు చేశారు. తాను కూడా అదే చేశాన‌ని, కానీ ప‌న్నీరు మ‌ళ్లీ మోసం చేశార‌ని శ‌శిక‌ళ అన్నారు. ఎవ‌రైనా పార్టీకి వ్య‌తిరేకంగా తిరుగుబాటు చేస్తే, దాన్ని మేం స‌హించ‌మ‌న్నారు. గ‌త 33 ఏళ్లుగా అమ్మతో అండ‌గా పోరాటం చేశాన‌ని, ఇప్పుడు కూడా తాను విజ‌యం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జ‌య మృతిచెందిన‌ప్పుడు రాష్ట్రంలో అల్ల‌ర్లు చోటుచేసుకుంటాయ‌ని కొందరు ఎదురుచూశారు, కానీ అలా జ‌ర‌గ‌కుండా చేశామన్నారు. అమ్మ మృతి త‌ర్వాత‌, తానే ప‌న్నీరును సీఎంగా ఎన్నుకున్న‌ట్లు శ‌శిక‌ళ చెప్పారు.

– త‌మిళ‌నాడు పీఠంపై ఎలాగైనా కూర్చోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న శశిక‌ళ ఆ దిశ‌గా ప‌ట్టు బిగించ‌డంలో భాగంగా ప్ర‌త్య‌ర్థి ప‌న్నీరుసెల్వంకు దొరక్కుండా త‌న‌వైపు ఉన్న ఎమ్మెల్యేల‌ను ఓ సీక్రెట్‌కు క్యాంప్‌కు తరలించారు. వీళ్లు ఎక్క‌డికి వెళ్లార‌న్న‌ది మాత్రం తెలియ‌లేదు. పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మొత్తం 134 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేల‌కు గాను.. 131 మంది హాజ‌ర‌యిన అనంత‌రం ఆ ఎమ్మెల్యేలు చేజార‌కుండా వారిని ర‌హ‌స్య ప్ర‌దేశానికి త‌రలించ‌డం చూస్తుంటే.. ప‌న్నీరుసెల్వంకు పూర్తిగా చెక్ పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది.

– అపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వంను తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప జయకుమార్ ఇవాళ కలిశారు.

-తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్ అధ్యయనం చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తమిళనాడులో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వెంకయ్య మాట్లాడుతూ పన్నీర్ సెల్వం, శశికళ మధ్య వివాదంలో కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గవర్నర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

-మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రేపు చెన్నైకు విచ్చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన చెన్నైకు చేరుకుంటారని మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాల సమాచారం. అపద్దర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం తన రాజీనామను ఉపసంహరించుకుని ప్రభుత్వ పగ్గాలు చేపడతానని అంటుండటం.. మరోవైపు 131 మంది ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించి బలనిరూపణ చేసుకునేందుకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత శశికళ సిద్ధంగా ఉండటంతో తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఉత్కంఠను రేపుతున్నాయి.