అంద‌గాడు శోభ‌న్ బాబు వార‌సులు ఏమ‌య్యారు?

ఎన్టీఆర్, ఏఎన్నార్ త‌ర్వాత వెట‌ర‌న్ హీరోల్లో శోభ‌న్ బాబు, కృష్ణ పేర్లు ఎంతో పాపుల‌ర్. ద‌శాబ్ధాల పాటు త‌మ‌దైన ఛ‌రిష్మాతో టాలీవుడ్ ని ఏలారు. ముఖ్యంగా శోభ‌న్ బాబుకు ఇండ‌స్ట్రీ అంద‌గాడిగా గొప్ప ఇమేజ్ ని ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. ఇరువురు భామ‌ల న‌డుమ ప్రేమ‌క‌థ‌లు సాగించే అంద‌గాడిగా అత‌డికి ఉన్న రేంజే వేరేగా ఉండేది. ఇక సినీరంగంలో సంపాదించి తెలివిగా పెట్టుబ‌డులు పెట్టి భారీ ఆస్తులు కూడ‌బెట్టిన హీరోగాను శోభ‌న్ బాబు గురించి స‌న్నిహితులు చెబుతుంటారు. శోభ‌న్ బాబు కూడ‌బెట్టిన ఆస్తులు ఇప్పుడు వేల కోట్లు అయ్యాయ‌న్న చ‌ర్చా ప్ర‌ముఖంగా ఉంది.

అయితే శోభ‌న్ బాబు ఎంత చేసినా ఎంత సంపాదించినా కానీ, ఆయ‌న వార‌సులు సినీరంగంలో లేరు! అన్న లోటు అలానే ఉంది. శోభ‌న్ బాబు అంత‌టి అంద‌గాడి వార‌స‌త్వం తెలుగు చిత్ర‌సీమ‌లో లేక‌పోవడం ఆయ‌న అభిమానుల‌ను ఎప్పుడూ నిరాశ‌కు గురి చేస్తుంటుంది. ప్ర‌తిసారీ శోభ‌న్ బాబు జ‌యంతి ఉత్స‌వాల్లో ఫ్యాన్స్ ఈ విష‌యాన్ని ప్ర‌స్థావిస్తుంటారు. అయితే శోభ‌న్ బాబు వార‌సులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ రంగంలో స్థిర‌ప‌డ్డారు? అన్న‌దానికి శోభ‌న్ బాబుకు బంధువు అయిన ప్ర‌ముఖ నిర్మాత స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు.

నిర్మాత కం పంపిణీదారు ధీర‌జ్ మొగిలినేని శోభ‌న్ బాబు మ‌న‌వ‌రాలిని పెళ్లాడి ఆ కుటుంబానికి బంధువ‌య్యారు. ఆయన ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో ఇచ్చిన స‌మాచారం మేర‌కు.. శోభ‌న్ బాబు వార‌స‌త్వం అంతా చెన్నై(నాటి మ‌ద్రాసు)లో సెటిల‌య్యారు. చెన్నైలో హోట‌ల్ రిసార్ట్స్ హాస్పిటాలిటీ రంగంలో స్థిర‌ప‌డ్డారు. కానీ ఎవ‌రూ న‌టులు అవ్వ‌లేదని ధీర‌జ్ మొగిలినేని ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

అయితే శోభ‌న్ బాబు ఆస్తుల్లో విలువైన ఒక ఆస్తి (హైద‌రాబాద్ అమీర్ పేట‌లో ఉంది)ని మ‌న‌వ‌రాలికి కూడా ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది. ఇదే విష‌యాన్ని స‌ద‌రు నిర్మాత‌ను ప్ర‌శ్నించ‌గా, అమీర్ పేట‌లో త‌న‌ భార్య‌కు భారీ ఆస్తిని క‌ట్ట‌బెట్టారన్న ప్ర‌చారం సాగింద‌ని, కానీ దానిని త‌న‌ మావ‌య్య గారు (భార్య తండ్రి) స్వ‌యంగా కొనుక్కున్నారని, శోభ‌న్ బాబు ఇవ్వ‌లేదని తెలిపారు. శోభ‌న్ బాబు వార‌సులు: శోభ‌న్ బాబు 15 మే 1958న శాంతకుమారిని వివాహం చేసుకున్నారు.

వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కరుణాశేష్ ఉన్నారు. శోభ‌న్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ, తన కొడుకును ఎప్పుడూ సినిమా పరిశ్రమకు పరిచయం చేయలేదు. అతడిని విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చాడు. వార‌సుడు ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని అనుభవించాడు. శోభన్ బాబు, కేవీ చలం ప్రాణ స్నేహితులు.. కేవీ చలం చనిపోయే వరకు ఆ తర్వాత చంద్రమోహన్‌తో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని కొన‌సాగించారు.

అతడు తన కార్మికులకు (డ్రైవర్, చెఫ్‌లు మొదలైనవి) ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన మంచి మ‌నిషి. వారిని ఆర్థికంగా బాగా స్థిరపరిచారు. ఆస్తులు, పెట్టుబడులు కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సూచనలు కూడా ఇచ్చేవారు. నటుడు మురళీ మోహన్ ముఖ్యంగా శోభ‌న్ బాబు సూచనలను అనుసరించి బాగా స్థిరపడ్డారు. చాలా ముందు చూపుతో భూములపై పెట్టుబ‌డులు పెట్ట‌మ‌ని సూచించిన తొలి త‌రం స్టార్ హీరో ఆయ‌న‌.

ఎస్వీఆర్ వార‌సులు ఎక్క‌డ‌? సినీరంగంలో ఎస్వీఆర్ వార‌సులు కొంత‌కాలం పాటు న‌టులుగా ప్ర‌య‌త్నించి ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. ఎస్వీఆర్ మ‌న‌వ‌డు హీరోగా ప్ర‌య‌త్నించారు.. కానీ స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు ఎస్వీ రంగారావు కుటుంబం నుంచి ఎవ‌రూ న‌టీన‌టులు రాలేదు. అలాగే తెలుగు సినీపరిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన అంద‌గాడు శోభ‌న్ బాబు కుటుంబం నుంచి కూడా ఎవ‌రూ న‌ట‌రంగంలో లేక‌పోవ‌డాన్ని అభిమానులు ఎప్పుడూ లోటుగానే భావిస్తారు.