ది వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి..!

ఈ తరం నటీమణుల్లో సహజత్వానికి దగ్గరగా తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేది ఎవరని చెప్పుకునే పేర్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె చేసిన సినిమాలు.. ఎంచుకున్న పాత్రలు చూస్తే ఆమె ఎంత సహజ నటి అన్నది అర్థమవుతుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మెప్పించిన సాయి పల్లవి తెలుగులో భానుమతి పాత్రలో ఇక్కడ ఆడియన్స్ ని ఫిదా చేసింది. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత సాయి పల్లవి ఇమేజ్ మారిపోయింది.

మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు సినిమాల్లో సాయి పల్లవి మంచి పాత్రలు చేస్తూ వచ్చింది. శ్యామ్ సింగ రాయ్ విరాటపర్వం ఇలా తన నటనతో ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకుంది సాయి పల్లవి. ఓ పక్క యాక్టర్ గా కెరీర్ కొనసాగిస్తూనే డాక్టర్ కోర్స్ చేసింది సాయి పల్లవి. ప్రేమం తర్వాత ఆమె జార్జియా వెళ్లి ఎం.బి.బి.ఎస్ చేసింది. సాయి పల్లవి నటించిన ప్రేమమ్ సినిమా నేటితో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది.

హీరోయిన్ గా సాయి పల్లవి కెరీర్ మొదలై ఎనిమిది ఏళ్లు అవుతుందన్నమాట. అయితే ప్రేమం కన్నా ముందు సాయి పల్లవి కస్తూరి మాన్ ధామ్ ధూమ్ సినిమాల్లో చిన్న పాత్ర చేసింది సాయి పల్లవి. అంతేకాదు పలు టీవీ డాన్స్ షోస్ లో కూడా సాయి పల్లవి టాలెంట్ చూపించింది.

డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది కాబట్టే ఆమె చేస్తున్న సినిమాల్లో పాటలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. సాయి పల్లవి సినిమాలో ఉందంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అన్న క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఆమె సినిమాలోని ఏదో ఒక సాంగ్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ రాబట్టాల్సిందే.

ఈతరం హీరోయిన్స్ లో ఎవరికీ లేని మరో క్వాలిటీ సాయి పల్లవిలో ఉంది. అదేంటి అంటే హిట్ పడగానే రెమ్యునరేషన్ డబుల్ చేస్తుంటారు కానీ ఆమె అలా చేయదని టాక్. అంతేకాదు గ్లామర్ షో విషయంలో కూడా సాయి పల్లవి దూరంగా ఉంటుంది. తను చేస్తున్న సహజ పాత్రలకు మేకప్ లెస్ తో సహజంగానే కనిపిస్తుంది సాయి పల్లవి.

విరాటపర్వం తర్వాత తెలుగులో సినిమా ఓకే చేయని సాయి పల్లవి కావాలని గ్యాప్ ఇవ్వలేదు అలా వచ్చిందని అంటుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమాను అమ్మడు ఓకే చేసింది. ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.